voter last list
-
లోక్‌సభకు రెడీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శాసనసభ, పంచాయతీ పోరు ముగిసింది. ఇక లోక్‌సభ సమరానికి తెరలేచింది. అతిత్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 2014లో ఏప్రిల్ నెలాఖరున లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ డేకు 90 రోజుల ముందు (గత ఎన్నికల రోజు) నిర్వర్తించాల్సిన క్రతువుకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిశీలించనుంది. పార్లమెంట్ ఎన్నికలకు రెడీగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఇదివరకే సూచించింది. ముఖ్యంగా ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకోవాలని నిర్దేశించింది. ఈవీఎంల ప్రక్షాళన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రక్షాళనకు తొలి ప్రాధాన్యతనివ్వాలని ఈసీ దిశానిర్దేశం చేసింది. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎంల సమర్థతను పరీక్షించాలని ఆదేశించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించిన ఈవీఎంలనే పార్లమెంటు ఎన్నికలకు కూడా ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన శాసనసభ ఎన్నికల సమాచారాన్ని తొలగించనున్నారు. డేటాను చెరిపివేయడమేగాకుండా.. ఈవీఎంల మీద అంటించిన స్టిక్కర్లు ఇతరత్రా వివరాలను కూడా తొలగించే ప్రక్రియను నేటి నుంచి చేపట్టనున్నారు. అయితే, న్యాయపరమైన ఇబ్బందులున్న అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను మాత్రం అలాగే భద్రపరచనున్నారు. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం ఫలితంపై బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లలో తేడా ఉండడంపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్‌కు వినియోగించిన 300 ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మినహా మిగతా నియోజకవర్గాల ఈవీఎంలను శుక్రవారం నుంచి మొదటి స్థాయి పరిశీలన (ఫస్ట్‌లెవల్ చెకింగ్) చేయనున్నారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 3,073 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,092 ఈవీఎంలను వినియోగించారు. వీటికి అదనంగా 566 రిజర్వ్‌గా ఉంచారు. వీటిలో ఇబ్రహీంపట్నం పోను మిగతా వాటిని పార్లమెంట్ ఎన్నికల్లో వాడనున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ యూనిట్లను యథాతథంగా వినియోగించనున్నారు. 4 వరకు ఓటరు జాబితా సవరణ ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల నాలుగు ఆఖరు తేదీ. ఆ లోపు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 11వ తేదీలోపు అభ్యంతరాలు, పరిష్కారాలకు చివరి తేదీ. ఆ తర్వాత 17వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 22న రాజకీయ పార్టీల ప్రతినిధులకు కొత్త ఓటర్ల జాబితాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలావుండగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలుండేవి. ఈ రెండింటికి గతంలో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించేవారు. జిల్లాల పునర్విభజనతో ప్రస్తుతం జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ మాత్రమే ఉంది. ఈ సెగ్మెంట్ పరిధిలో చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు వస్తుండగా, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వెళుతోంది. ఎల్బీనగర్ సెగ్మెంట్ మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. ఇక పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జిల్లాలో చేరిన షాద్‌నగర్.. మహబూబ్‌నగర్ ఎంపీ సీటు పరిధిలో, అలాగే కల్వకుర్తి సెగ్మెంట్ పరిధిలోని కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలు నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలోకి రానున్నాయి. -
మళ్లీ.. మొదటికి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా మళ్లీ మొదటికొచ్చి నట్లే కనిపిస్తోంది. పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాపై కసరత్తు ప్రారంభించింది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగానే మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పంచాయతీ ఓటర్ల జాబితాపైన జిల్లా పంచాయతీ విభాగం దృష్టి సారించింది. తాజాగా ప్రకటించిన అసెంబ్లీ ఓటరు జాబితాకు, గతంలో పంచాయతీ ఎన్నికల కోసం విడుదల చేసిన ఓటరు జాబితాకు మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నదో తెలియజేయాలని జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయని సమాచారం. ఎన్నికల సంఘం కోరిన సమాచారం మేరకు... అసెంబ్లీ ఓటర్లకు, పంచాయతీ ఓటర్లకు మధ్య వ్యత్యాసం స్వల్పంగా ఉన్నట్లయితే అసెంబ్లీ ఓటరు జాబితాకు అనుబంధ జాబితా జత చేస్తారని అంటున్నారు. ఆ రెండు జాబితాల మధ్య వ్యత్యాసం భారీగా ఉన్నట్లయితే మళ్లీ ఓటరు నమోదుకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల వ్యత్యాసంతో పాటు, జిల్లా పంచాయతీ అధికారుల అభిప్రాయాన్ని కూడా ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు అధికారులు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలన్న అభిప్రాయమే వ్యక్తం చేశారని తెలిసింది. మే నెలలో ప్రకటించిన పంచాయతీ ఓటర్ల జాబితాకు, అసెంబ్లీ ఓటర్ల జాబితాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతోపాటు, పోలింగ్ స్టేషన్ల నంబర్లు కూడా తారుమారయ్యాయని సమాచారం. దీంతో తప్పనిసరిగా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. జిల్లాకో రెండు గ్రామాల ఎంపిక ఓటర్ల సంఖ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నదో తెలుసుకునేందుకు జిల్లాకో రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆ గ్రామాల్లో పాత పంచాయతీ ఓటర్లు, ప్రస్తుత అసెంబ్లీ ఓటర్ల సంఖ్య మధ్య తేడాను గుర్తించమన్నారు. జిల్లాలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అనుమల మండలం పేరూరు, నకిరేకల్ నియోజకవర్గంలో కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ పంచాయతీలను పైలెట్‌గా తీసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో ప్రకటించిన పంచాయతీ ఓటర్ల ప్రకారం పేరూరు గ్రామంలో మొత్తం ఓటర్లు 685 మంది ఉన్నారు. పోలింగ్ స్టేష¯న్ నంబరు 126. ఇక, అసెంబ్లీ తాజా ఓటరు జాబితా ప్రకారం అదే గ్రామంలో ఓటర్ల సంఖ్య 714కు పెరిగింది. 29 మంది ఓటర్లు అదనంగా చేరారు. అలాగే పోలింగ్ స్టేషన్ నంబరు కూడా 136గా మారింది. ఉప్పలపహాడ్‌లో పంచాయతీ ఓటర్లు 820 మంది. అసెంబ్లీ తాజా ఓటర్ల లెక్కల ప్రకారం ఆ గ్రామంలో ఓటర్లు 939. అంటే కొత్తగా 119 మంది ఓటర్లు చేరారు. పోలింగ్ స్టేషన్ నంబరు 263 ఉండగా, కొత్త పోలింగ్ స్టేషన్ నంబరు 276గా మారింది. ఇలాంటి మార్పులే దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉంటాయని అధికారులు అంటున్నారు. ఓటర్ల సంఖ్యతోపాటు, పోలింగ్ స్టేష¯న్ నంబర్లు కూడా మారుతున్నందున కొత్త నోటిఫికేషన్ జారీ చేయక తప్పదని అంటున్నారు. బ్యాలెట్ పత్రాలు బూడిదే గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు ఒకటికి నాటికి ముగిసింది. జూలై నెలలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రించింది. అయితే పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లో జరిగితే ముద్రించిన బ్యాలెట్ పత్రాలు వినియోగించుకునే వీలుందని, అలా కాకుండా వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే 2018తో ముద్రించిన బ్యాలెట్ పత్రాలను బూడిద చేయక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ పేపరుకు అయ్యే ఖర్చు రూ.లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వమే నేరుగా బ్యాలెట్ పేపరు కోసం టెండర్ పిలుస్తుంది. ఆ పేపరు జిల్లాలకు పంపిస్తే అవసరం మేరకు సర్పంచులు, వార్డు సభ్యుల గుర్తులు ముద్రిస్తారు. ఎన్నికలు వాయిదా పడడంతో అప్పట్లో ముద్రించిన బ్యాలెట్ పేపర్లు అన్నీ గోదాముల్లో భద్రపర్చారు. జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యులకు కలిపి 22 లక్షల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ముద్రణకు రూ.9లక్షలు ఖర్చయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 9.50లక్షల బ్యాలెట్‌పత్రాలు ముద్రించగా, దీనికి రూ.3లక్షలు ఖర్చయ్యింది. ముద్రించిన బ్యాలెట్ పత్రాలను ఓ ప్రైవేటు గోదాంలో భద్రపరచగా, ఆ గోదాముకు నెలకు రూ.10వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. -
ఖమ్మం ఫస్ట్... అశ్వారావుపేట లాస్ట్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య తేలింది. అన్ని ప్రక్రియల అనంతరం అనేక మార్పులు, చేర్పులు తర్వాత జిల్లా ఓటర్ల తుది జాబితా శుక్రవారం తయారయింది. ఈ తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 19,71,797 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 9,75,432 మంది కాగా, స్త్రీలు 9,96,254 మంది. అంటే జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే 20,822 మంది ఎక్కువ ఉన్నారు. ఇచ్చిన గడువు శుక్రవారం నాటితో ముగియడంతో ఓటర్ల లెక్కను ఖరారు చేసిన కలెక్టర్ తుది జాబితాను ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలిసింది. ఈ జాబితాపై ఎన్నికల సంఘం ఆమోదముద్ర పడడమే తరువాయి. అన్నింటా పెరిగారు... ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ స్థానాలు రిజర్వ్ కాబడిన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్లు పెరిగారు. ఓటర్ల సంఖ్య ప్రకారం ఖమ్మం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,54,667 మంది ఓటర్లు నమోదయ్యారు. కాగా, జిల్లాలో అతి తక్కువ ఓటర్లు నమోదయింది అశ్వారావుపేట నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో 1,64,419 మంది ఓటర్లున్నారని తేలింది. ఖమ్మం పార్లమెంటు స్థానంలో మొత్తం ఓటర్లు 14,07,974 మంది నమోదు కాగా, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలోకి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో (పినపాక, భద్రాచలం, ఇల్లెందు) కలిపి 5,63,823 మంది ఓటర్లు తేలారు. విశేషమేమిటంటే..... ఒక్క పినపాక నియోజకవర్గం మినహా అన్ని చోట్లా మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈసారి సార్వత్రిక ఎన్నికలలో మహిళా శక్తి అభ్యర్థుల జాతకాలను నిర్ణయించనున్నదన్నమాట.