హైదరాబాద్: 2013లో రాష్ట్రంలో ఏర్పడిన కరువు కారణంగా ఖరీఫ్ పంటలు ఎండిపోయాయి. ఖరీఫ్, రబీ పైర్లను పైలీన్, లెహర్, హెలెన్ తుపాన్లు, నైరుతి రుతుపవనాలతో కురిసిన కుండపోత వర్షాలు తుడిచిపెట్టేశాయి. ఈ క్రమంలో కోస్తాలోని 423 మండలాలను తుపాను ప్రభావిత మండలాలుగా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కోస్తా పంటలను తుపాన్లు దెబ్బతీయగా.. రాయలసీమలో కరువు పరిస్థితులు పంటలను మాడిపోయేలా చేశాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 119 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించగా ఇందులో 6 మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మిగిలిన 113 కరువు మండలాల్లో 108 రాయలసీమలో ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లోని రైతులు పెట్టుబడులు కోల్పోయి అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో వీరికి రూ.2,173.61 కోట్ల మేరకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసి ఆదుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా ఇప్పుడు ఆ సబ్సిడీని ఎగ్గొట్టాలని నిర్ణయించింది.
గణాంకాలు మేరకు..
అధికారిక గణాంకాల ప్రకారం పైలీన్ తుపాను, భారీ వర్షాలవల్ల రాాష్ట్రంలో 2013 అక్టోబరులో 33 లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల్లో 63 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ.7,200 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
2013 నవంబరులో వచ్చిన హెలెన్ తుపానువల్ల తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. ఆ వెంటనే లెహర్ రూపంలో మరో తుపాను నాశనం చేసింది.
విపత్తులవల్ల అప్పుల్లో కూరుకుపోయి ఉన్న అన్నదాతలకు పెట్టుబడి రాయితీ అయినా ఇచ్చి ఊరట కలిగించాల్సిన ప్రభుత్వం పూర్తిగా ఎగనామం పెట్టాలని నిర్ణయించింది. ఇంతటి నష్టాలకు సంబంధించి పెట్టుబడి రాయితీ బకాయిల గురించి విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రస్తావించగా ‘పాతవన్నీ మర్చిపోండి. ఇక వాటిని ఇచ్చేది లేదు. 2014 కరువు, హుద్‌హుద్‌కు పెట్టుబడి రాయితీ గణాంకాలు మాత్రమే సమర్పించండి’ అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అనడంతో అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది.
2014 నష్టాలకే ఇన్‌పుట్ సబ్సిడీ
గత ఏడాది(2014)లో కరువు, హుద్‌హుద్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు మాత్రమే పెట్టుబడి రాయితీ పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది రాష్ట్రంలోని 84.33 శాతం మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క జిల్లాలోనూ కనీస సాధారణ వర్షం కురవలేదు. రాష్ట్రం మొత్తమ్మీద సగటు కనీస సాధారణ వర్షపాతం కంటే 36 శాతం తక్కువ వర్షం కురిసింది. ఫలితంగా 560 మండలాల్లో కరువు కోరలు చాచింది. దీంతో వీటిని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి. అయితే, అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తే.. ఎక్కువ పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం డ్రాట్ మాన్యువల్స్ పేరిట 226 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 50 శాతంపైగా పంట నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకు రూ.701.50 కోట్లు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సి ఉంది. అదే సంవత్సరంలో హుద్‌హుద్ తుపానువల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రూ.355 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. మిగిలిన బకాయిని విడుదల చేయాల్సి ఉంది.
వరుస విపత్తులతో 2013లో పంటలు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలకు చంద్రబాబు సర్కారు శఠగోపం పెడుతోంది!. 2013లో కరువు, వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్ సబ్సిడీ) కోసం ఏడాదిన్నరగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అంతో ఇంతో అందే మొత్తంతో ప్రత్యామ్నాయ పంటలనైనా వేసుకుందామని భావిస్తున్నారు. ఈ తరుణంలో వారి ఆశలపై బాబు సర్కారు నీళ్లు కుమ్మరించింది. 2013 నాటి పెట్టుబడి రాయితీ రూ.2,173.61 కోట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి యనమల అధికారులకు స్పష్టం చేశారు.
ఆత్మస్థైర్యం నింపేది ఇలాగేనా?
కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన విపత్తులతో రైతులు అప్పుల్లో చిక్కుకుని వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో కొద్దిపాటి సాయమైనా అందించి ఆత్మస్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఏకంగా పెట్టుబడి రాయితీ బకాయిలు ఎగ్గొట్టాలని నిర్ణయించడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. రకరకాల కొర్రీలతో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన చందంగానే బాబు ప్రభుత్వం 2013నాటి పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వకుండా రైతులకు పంగనామాలు పెట్టిందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇది బాబు మార్కు మోసమని వారంటున్నారు.
అన్నదాతలకు బాబు శఠగోపం!
Published Mon, Mar 9 2015 2:41 AM | Last Updated on Fri, May 25 2018 2:20 PM
Advertisement
Advertisement