బిడ్డా.. ఎక్కడ!
కళ్లన్నీ కన్నీళ్లు చేసుకుని కన్నవారి ఎదురుచూపులు
ముందుకు సాగని పోలీసుల దర్యాప్తు
సిబ్బంది నిర్లక్ష్యమే అపహరణకు కారణమని విమర్శలు
కిలాడీ లేడీ కోసం ముమ్మరంగా దర్యాప్తు
పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్లు పొత్తి కడుపులో బాధ మెలిపెడుతుంటే.. అంతులేని ఆవేదనను మునిపంటి
కింద బిగబట్టి బిడ్డకు పురుడు పోసింది. పట్టుమని పది రోజులైనా కాకుండానే మురిపాలకు దూరమైన బిడ్డను తలుచుకుని ఆ తల్లిదండ్రుల గుండె నీరుగారింది. అడిగో బిడ్డ.. అంటూ కన్నపేగుకు ఆశలు కల్పించిన సీసీ కెమెరా ఫుటేజ్.. 24 గంటలు గడవకుండానే తప్పని తేలడంతో వారి ఆందోళన రెట్టింపైంది. కన్న బిడ్డ కోసం కళ్లన్నీ కన్నీళ్లు చేసుకుని.. కనిపించిన ప్రతి ఒక్కరినీ మా బిడ్డ ఎక్కడంటూ ఆ తల్లిదండ్రుల గుండె ఘోష ఆర్తిగా వేడుకుంటోంది.
విజయవాడ (లబ్బీపేట) : చికిత్స కోసం వస్తే.. బిడ్డనే దూరం చేశారు.. ఇప్పుడు బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గురువారం అపహరణకు గురైన తమ బిడ్డను పోలీసులు ఎప్పుడు తీసుకొస్తారో అని నిస్సహాయ స్థితిలో వారు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. బస్టాండ్‌లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌తో కీలక ఆధారాలు దొరికాయని, ఇక తమ బిడ్డ తమ చెంతకు చేరతాడని పెట్టుకున్న ఆశలు శుక్రవారం సాయంత్రానికి గల్లంతయ్యాయి. విజువల్స్ తప్పని తేలడంతో తమ బిడ్డ ఎప్పటికి తమ చెంతకు చేరతాడోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సిబ్బంది తీరును నిరసిస్తూ బంధువులతో కలిసి శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు.
ఎలా ఎత్తుకెళ్లారనేదే ప్రశ్న...
నవజాత శిశువులు చికిత్స పొందే స్పెషల్ న్యూ బోర్న్ బేబీ కేర్ యూనిట్‌లోకి సందర్శకులను ఎవరినీ అనుమతించరు. ఆ విభాగంలో చికిత్స పొందే చిన్నారులందరినీ, లోపల ఉన్న సిబ్బందే పర్యవేక్షించడం, మందులు వేయడం చేస్తుంటారు. అలాంటి విభాగంలోకి గుర్తుతెలియని మహిళ వెళ్లి శిశువును ఎలా అపహరించిందని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అక్కడ వార్మర్‌లో ఉన్న పసిబిడ్డను తీసుకు వస్తున్న సమయంలో లోపల ఉన్న సిబ్బంది గమనించ కపోవడం వారి నిర్లక్ష్యాన్ని చాటుతోందని చెబుతున్నారు. స్పెషల్ కేర్‌లోని శిశువులకే రక్షణ లేకుంటే, వార్డుల్లోని శిశువుల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వార్డులో ఉన్న శిశువును అపహరించుకుపోయారని, ఇప్పుడు ఏకంగా ఎస్‌ఎన్‌సీయూలో శిశువునే అపహరించడం ఆస్పత్రి భద్రత డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
సిబ్బంది పాత్రపై అనుమానాలు
ఎస్‌ఎన్‌సీయూలో పనిచేసే వారంతా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారిలో శాశ్వత ఉద్యోగులెవరూ లేరు. పసిబిడ్డ అపహరణకు సంబంధించి ఇప్పటికే ఎస్‌ఎన్‌సీయూ వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యురిటీ గార్డు ముఖర్జీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇతర సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో తిరిగిన కిలాడీ లేడీ ఇంకా ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగేదా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ విభాగం నుంచి సిబ్బంది సహకారం లేకుండా శిశువును అపహరించడం సాధ్యం కాదనే అంచనాకు వచ్చారు. మరోవైపు బాధితుల బంధువుల నుంచి సమాచారం ఏమైనా వస్తుందేమోనని ఏసీపీ కంచె శ్రీనివాసరావు వారిని శుక్రవారం విచారించారు. ఈ ఘటనలో నలుగురు వైద్యులు, 14 మంది ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వారిపై వేటుపడే అవకాశమున్నట్లు సమాచారం.
కలకలం రేపిన
మృతదేహం.. పోలీసుల ఉరుకులు, పరుగులు
ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న రైవస్ కాల్వలో శుక్రవారం మధ్యాహ్నం మగశిశువు మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. అపహరణకు గురైన బిడ్డ బంధువులకూ చూపించారు. అయితే ఆ మృతదేహం ఆస్పత్రిలో ప్రసవం అనంతరం మృతి చెందిన మరో శిశువుదిగా గుర్తించారు.
ముందుకు సాగని దర్యాప్తు
పసిబిడ్డ ఆచూకీ కోసం పది బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా, దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బస్టాండ్‌లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌ను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం సాయంత్రం వరకు గాలింపు చేపట్టగా, అవి సరికాదని తేలడంతో మరో కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఆస్పత్రి మెయిన్ గేటు ఎదురుగా ఉన్న మందుల దుకాణంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ దానిలో విజువల్స్ క్లియర్‌గా లేవని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా శిశువును క్షేమంగా పట్టుకుని తీసుకొస్తామని చెబుతున్నా.. సరైన ఆధారాలు లేకపోవడంతో శిశువు ఆచూకీ ఎప్పటికి దొరుకుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.