హైదరాబాద్: ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని...ఆ ఇంట్లో యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను వారికి తెలియకుండా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా చూస్తుండటంతో పసిగట్టిన బాధిత యువతులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటగిరిలోని హైలం కాలనీలో సయ్యద్ సలీం అనే వ్యక్తి తన ఇంట్లో ఓ గదిని ఇద్దరు యువతులు, ఒక యువకుడికి అద్దెకిచ్చాడు.
రెండున్నర నెలల క్రితం వీరు ఈ గదిలో అద్దెకు దిగారు. కాగా సదరు ఇంటి యజమాని అద్దెకిచ్చిన గదిలో మీటర్ బాక్స్ పేరుతో ఓ ప్లాస్టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేసి అందులో సీసీ కెమెరా పెట్టాడు. మరో నాలుగు కెమెరాలు తన ఇంట్లో ఏర్పాటు చేసి..రెండు డీవీఆర్‌లను బిగించాడు. నాలుగు రోజుల క్రితం తమ ఇంట్లో ఏర్పాటు చేసిన బాక్సు నుంచి వైరు నేరుగా ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్లడాన్ని గమనించిన యువతులు ఇదేమిటని ఆరా తీశారు.
తీరా చూస్తే అది సీసీ కెమెరా అని తేలింది. దీంతో బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిందితుడు సయ్యద్ సలీం సీసీ కెమెరా ఏర్పాటుచేసి యువతులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడు వాటిని రికార్డు చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆ సీసీ ఫుటేజీలను పోలీసులకు అందజేశాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 355(సి), 509, 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment