మా బిడ్డను అల్లుడే హతమార్చాడంటూ మృతురాలి తండ్రి రమణారెడ్డి సోమవారం ములకలచెరువు సీఐ రుషికేశవ్‌కు ...
పోలీసులకు మృతురాలి తండ్రి ఫిర్యాదు
కర్ణాటకకే మహిళ మృతదేహం తరలింపు
పెద్దతిప్పసముద్రం: మా బిడ్డను అల్లుడే హతమార్చాడంటూ మృతురాలి తండ్రి రమణారెడ్డి సోమవారం ములకలచెరువు సీఐ రుషికేశవ్‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు... మండలంలో ని మడుమూరు పంచాయతీ దొరిగుండ్లవారిపల్లికి చెందిన అశోక్‌రెడ్డితో, మదనపల్లెకి చెందిన అనసూయ(24)కు వివాహం జరిగింది. వీరు నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లి ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ జీవిస్తుండేవారు. రెండు రోజుల క్రితం కుటుంబ కలహాలతో భార్యాభర్త లు గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో అనసూయ బెంగళూరులోనే ఇంటిలో ఫ్యాను కు ఉరేసుకున్న స్థితిలో మృతి చెందింది.
అశోక్‌రెడ్డి ఈ విషయాన్ని అత్తామామలకు తెలియజేయకుండా మృతదేహాన్ని స్వగ్రామమైన దొరిగుండ్లవాపల్లికి తరలించి, ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పా డు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు దొరిగుండ్లవారిపల్లికి చేరుకుని బోరున విలపించారు. కట్టుకున్న భర్తే తమ కుమార్తెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ రుషికేశవ్ సోమవారం అనసూయ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేయడం తమ పరిధిలోకి రాదని మృతురాలు చనిపోయింది కర్ణాటకలో కావడం తో బెంగళూరుకే వెళ్లాలని సూచించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్ణాటకకే తరలించారు.