ప్రతీకారం తీర్చుకున్న హంతకులు
పెద్దారవీడు, న్యూస్‌లైన్ : పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన తోకపల్లె సమీపంలోని తీగలేరు బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గొబ్బూరుకు చెందిన గోతం వెంకటేశ్వర్లు(35) కొద్ది రోజుల నుంచి మార్కాపురం పూలసుబ్బయ్య కాలనీలో నివసిస్తున్నాడు. త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో నివసిస్తున్న తన సోదరులు కృష్ణ, శ్రీనుల వద్దకు వెంకటేశ్వర్లు బైకుపై వెళ్లాడు.
తన అన్న కుమారుడు శివతో కలిసి తిరిగి మార్కాపురం వస్తుండగా మార్గమధ్యంలో ప్రత్యర్థులు కాపుగాసి వెంకటేశ్వర్లును హైవేపై అడ్డగించారు. ఆ బాలుడిని పక్కకు తీసి వెంకటేశ్వర్లు తలపై రాయితో విచక్షణారహితంగా మోదారు. గొంతుపై గోడ్డళ్లతో నరకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో బాలుడు బిత్తరపోయి పెద్దగా ఏడ్వటం ప్రారంభించాడు. ఆ రహదారిపై నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. హంతకులు క్షణాల్లో తమ ప్రత్యర్థిని చంపి పరారయ్యారు. నిందితులు కూడా బైకులపై వచ్చినట్లు సమాచారం.
ప్రతీకారం తీర్చుకున్న హంతకులు
రెండేళ్ల కిందట గొబ్బూరు బీసీ కాలనీలో నివసిస్తున్న నాలి సాంబయ్యను చంపిన కేసులో వెంకటేశ్వర్లు మొదటి ముద్దాయి. ఆయన తాలుకా మనుషులే వెంకటేశ్వర్లును చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటారని సంఘటనా స్థలం వద్దకు వచ్చిన గొబ్బూరు వాసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల కిందట స్వగ్రామం గొబ్బూరు విడిచి వెళ్లి మార్కాపురం, త్రిపురాంతకం మండలంలోని సోమేపల్లిలో వెంకటేశ్వర్లు సోదరులు నివాసం ఉంటున్నారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
హత్య జరగడంతో హైవేరోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తహశీల్దార్ గర్నెపూడి లెవి, వీఆర్వో అచ్చయ్య, మార్కాపురం రూరల్, పట్టణ ఎస్సైలు దేవకుమార్, రాంబాబు, ఏఎస్సై సుదర్శనం, రైటర్ రామకృష్ణారెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. పెద్దారవీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.