భర్త సమాధిపై శపథం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుల్లే శివబాల
పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్‌బోర్డును తొలగించారు.
ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు.
అనంతపురం అర్బన్‌తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment