వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించారని ఇద్దరు యువకుల దారుణహత్య | Brutal murder of two guys | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించారని ఇద్దరు యువకుల దారుణహత్య

Published Fri, Jun 7 2024 4:45 AM | Last Updated on Fri, Jun 7 2024 4:45 AM

Brutal murder of two guys

కడ్తాల్‌ సమీపంలోని బటర్‌ ఫ్లై సిటీ వెంచర్‌ విల్లాలో ఘటన 

కడ్తాల్‌: వాట్సాప్‌ గ్రూపు లొల్లి ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలోని బటర్‌ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందాయిపల్లికి చెందిన బీజేపీనేత జల్కం రవి ఇటీవల బటర్‌ ఫ్లై వెంచర్‌లోని ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నెల 4న సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులతో కలిసి రవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. 

ఈ ఫోటోలను రవి తన గ్రామా నికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గోవిందాయిపల్లికి చెందిన గుండెమోని శివగౌడ్‌(25), శేషగారి శివగౌడ్‌(27)లు రవిని వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించారు. దీంతో 5వ తేదీన సాయంత్రం రవి వీరిద్దరిని తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అప్పటికే రవి వద్ద  బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్‌ ఉన్నాడు. నలుగురూ మద్యం తాగడం మొదలుపెట్టారు. 

ఈ క్రమంలోనే వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి నన్ను ఎందుకు తొలగించారు..? ఫొటోలు ఎందుకు డిలీట్‌ చేశారు అని రవి ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికిలోనైన రవి, పల్లె రాజుగౌడ్‌ కత్తులలో దాడి చేసి గుండెమోని శివగౌడ్, శేషగారి శివగౌడ్‌ను చంపేశారు. అనంతరం విల్లాకు తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్‌ ఫ్లై సిటీలోని ఆ విల్లాకు వెళ్లి తాళం పగులగొట్టారు. లోపల రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. 

గుండెమోని శివగౌడ్‌ హైదరాబాద్‌లోని ఓ చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తుండగా, శేషుగారి శివగౌడ్‌ డ్రైవర్‌గా పనిచేస్తునట్టు తెలిసింది. యువకుల హత్యలకు వాట్సాప్‌ వివా దమే కారణమా.. మరేదైనా ఉందా..? అని గ్రామస్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ  శ్రీశైలం– హైదరాబాద్‌ జాతీ య రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రెండుగంటలకుపైగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 

ఈ సమయంలో హైదరాబాద్‌ వెళుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌ జెడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్‌ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement