సాక్షి, విజయవాడ/తాడేపల్లి రూరల్: కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి)కు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో జరిగిన ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ హాజరయ్యారు.
(చదవండి: అధర్మం ఓడిపోతుందని ఆనాడే చెప్పాం)
ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్‌కుమార్ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఈ మహోత్సవానికి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి.. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి పుష్పాభిషేకం చేశారు.
సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవంలో భాగంగా గత మూడురోజులుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో కృష్ణ తీరంలో యాగ, హోమ, దాన, పూజాదికాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా కిరణ్‌కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment