కిరణ్ సర్కారును.. కడిగిపారేసిన కాగ్ !
నిధుల విడుదల జాప్యంతో సకాలంలో నీటి ప్రాజెక్టులు పూర్తికాలేదన్న కాగ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంచనా వ్యయం పెరిగి ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం సంక్షేమ పథకాల అమల్లోనూ కిరణ్ సర్కారు తీరును తీవ్రంగా ఆక్షేపించిన కాగ్ లబ్ధిదారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేశారని స్పష్టీకరణ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని తుడా,స్విమ్స్ యాజమాన్యాలకు చీవాట్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్షేమాభివృద్ధి పథకాలకు బడ్జెట్‌లో నిధు ల కేటాయింపునకు విడుదలకూ పొంతన కుదరకపోవడం వల్ల ప్రగతి తిరోగమిస్తోందని కంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. నిధుల విడుదలలో నిర్లక్ష్యంవల్ల సాగునీటి ప్రాజెక్టుల అం చనా వ్యయం అంతకంతకూ పెరి గి ప్రభుత్వ ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం పడిందని తేల్చింది. ఇందిరప్రభ, రాజీవ్ యువకిరణాలు, మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు వంటి పథకాల్లోనూ లబ్ధిదారులకు మొండిచేయి చూపారని పేర్కొంది. వివరాల్లోకి వెళితే..
2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను శనివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి కిరణ్ ప్రభుత్వం నిర్వాకాలను కాగ్ తూర్పారబట్టింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందు కు 2011-12లో ‘గ్రీన్ చానల్’ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కానీ.. తాను ప్రవేశపెట్టిన విధానాన్నే కిరణ్ సర్కారు అపహాస్యం చేసింది. బడ్జెట్లో కేటాయించిన మేరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2011-12,2012-13 బడ్జెట్లలో సాగునీటి ప్రాజెక్టులకు అతి తక్కువ నిధులు విడుదల చేసింది. నిధుల కొరతకు భూసేకరణ సమస్య తోడవడంతో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. స్టీలు, సిమెంటు, ఇంధనం వంటి ధరలు పెరగడంతో సా గునీటి ప్రాజెక్టుల వ్యయం అంతకంతకూ పెరిగింది.
సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును 2007-08లో రూ.399 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 88,300 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 23,666 ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించాలని, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిధులనూ సర్దుబాటు చేయలేకపోయింది. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.437.42 కోట్లకు పెరిగింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.38.42 కోట్ల భారం పడిందని కాగ్ తేల్చిచెప్పింది.
రాయలసీమలో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలన్న లక్ష్యంతో రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులకు మార్చి 31, 2013 నాటికి రూ.6188.79 కోట్లను ఖర్చు చేశారు. నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రభుత్వ ఖజానాపై రూ.3,615 కోట్ల భారం పడిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
గాలేరు-నగరి ప్రాజెక్టు కింద కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల పరిధిలో 3.25 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. 2005లో ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,777.94 కోట్లు. మార్చి 31, 2013 నాటికి రూ.4,135.62 కోట్లను ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడంతో పనులు సాగ డం లేదు. దీని వల్ల అంచనా వ్యయం పెరిగి.. ప్ర భుత్వ ఖజానాపై రూ.5,143.21 కోట్ల భారం పడింది.
తెలుగుగంగ ప్రాజెక్టు కింద చెన్నై నగరానికి తాగునీరు అందించాలని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 1.40 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. 1983లో ఆ ప్రాజెక్టును చేపట్టినప్పు డు అంచనా వ్యయం రూ.637 కోట్లు. కానీ.. ఆ ప్రాజెక్టుకు నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల పనులు సా..గుతూ వస్తున్నాయి. దీ నివల్ల అంచనా వ్యయం రూ.4,432 కోట్లకు పెరి గింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.3,795 కో ట్ల భారం పడినట్లయిందని కాగ్ స్పష్టీకరించింది. ఈ తాగునీటి ప్రాజెక్టుకు సక్రమంగా నిధులు కేటాయించాలని పేర్కొంది.
సంక్షేమం కాదు.. సంక్షామమే!
రైతులకు 2011 నుంచి రూ.లక్ష వరకూ వడ్డీ లేని రు ణాలు.. రూ.3 లక్షల వరకూ పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే ఈ రాయితీ వర్తింపజేస్తామని మెలిక పెట్టింది. కానీ.. జిల్లాలో సకాలంలో చెల్లించిన రైతులకు రూ.14 కోట్లకు పైగా వడ్డీ రాయితీని చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ ఎత్తిచూపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకూ వడ్డీ రాయితీని అందించడంలో ప్రభుత్వం దాటవేత వైఖరి అనుసరిస్తోందని పేర్కొంది. మార్చి 31, 2013 నాటికి మహిళా సంఘాలకు రూ.21 కోట్ల మేర వడ్డీ రాయితీని చెల్లించక పోవడాన్ని ఎత్తిచూపింది.
ఇందిరమ్మ గృహనిర్మాణంలోనూ ప్రభుత్వం తీరును తప్పుపట్టింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారని ఆరోపించింది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.28 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చింది. ముస్లింలు, క్రిస్టియన్ల సంక్షేమానికి కేటాయించిన నిధుల వినియోగంలోనూ ప్రభుత్వం పిసినారితనాన్ని ప్రదర్శించిందని పేర్కొంది. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించడంలోనూ.. ఇందిర జలప్రభ కింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలోనూ ప్రభుత్వం కాడిదించడాన్ని కాగ్ ఆక్షేపించింది.
తుడా, స్విమ్స్‌లకు చీవాట్లు
తిరుపతి పట్టాణాభివృద్ధి సంస్థ(తుడా), శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్)కూ కాగ్ చీవాట్లు పెట్టింది. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి మాత్రమే తుడా ఆడిటింగ్ పూర్తి చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను తుడా అందించలేదని కాగ్ పేర్కొంది. తుడా నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయాలను లీజుకు ఇవ్వకపోవడం వల్ల సంస్థకు భారీ ఎత్తున నష్టం వస్తోందని తేల్చింది. స్విమ్స్‌నూ కాగ్ కడిగేసింది. నిధుల వినియోగంలో స్విమ్స్ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్‌ను చేయించడంలో స్విమ్స్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టింది. ఆడిట్ నివేదికను ఇప్పటిదాకా అందించలేదంది. ఎప్పటికప్పుడు ఆడిట్ చేయించి.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆ సంస్థకు సూచించింది.