తమ్ముడి చేతికి బ్యాట్
- పోటీ నుంచి తప్పుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి
- పీలేరు బరి నుంచి సోదరుడు కిషోర్ నామినేషన్
- నామినేషన్ వేసే వరకు గోప్యం
- ఓటమి భయంతోనే కిషోర్‌ని బరిలోకి తెచ్చారని ప్రచారం
- కిరణ్ నిర్ణయంతో జేఎస్పీ అభ్యర్థుల్లో సడలిన ఆత్మస్థైర్యం
మ్యాచ్ ప్రారంభానికి ముందే జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులెత్తేశారు. తమ్ముడి చేతికి బ్యాట్ ఇచ్చి తాను ప్రేక్షకుడి పాత్రకే పరిమితమయ్యారు. చెలరేగి ఆడతాడనుకున్న తమ నాయకుడు ముందే అస్త్రసన్యాసం చేయడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఖంగుతిన్నారు. రాజకీయ భవిష్యత్తుపై పెట్టుకున్న అంతోఇంతో ఆశను వారు వదిలేసుకున్నారు.
సాక్షి, తిరుపతి: జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు నేలవిడిచి సాముచేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజున మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేఎస్పీ తరపున కిరణ్ సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి అలియూస్ కిషోర్‌కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం రా జకీయవర్గాలను విస్తుపోయేలా చేసింది. నామినేషన్ పత్రాలు దాఖలుచేసే వరకు కిరణ్‌కుమార్‌రెడ్డినే అభ్యర్థిగా భావించారు.
చివరకు కిషోర్ పేరుతో నామినేషన్ వేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీ అధ్యక్షులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు షాక్‌కు గురయ్యారు. కిరణ్ వ్యూహం ఏమైనప్పటికీ అభ్యర్థులు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయారు. ముందుండి నడిపించాల్సిన నాయకుడు యుద్దం లోకి వెళ్లకముందే అస్త్రసన్యాసం చేసినట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా ప్రచారం చేయాల్సి ఉన్నందున కిషోర్‌ను పోటీకి దింపినట్లు కిరణ్ చెప్పడం సాకు మాత్రమేనని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు ఎన్నికల బరిలో ఉంటూనే ఆ పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న వైనం గుర్తుచేస్తున్నారు.
అంతా హైడ్రామా
నామినేషన్ దాఖలుకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి స్వగ్రామమైన నగిరిపల్లెలో అనుయాయులతో సమావేశమయ్యారు. ఆయన ఎక్కడా తాను పోటీ చేయనన్న విషయాన్ని బయటపెట్టలేదు. అందరితోనూ కలివిడిగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్నారనే ఆయన వర్గీయులు భావించారు. కిందటి వారం నగిరిపల్లెకు వచ్చిన ఆయన పీలేరు నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈలోగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ముందు రోజు రాత్రి తన మనసులోని మాటను కిషోర్‌కుమార్‌రెడ్డికి తెలియజేసి ఆ మేరకు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు ర్యాలీ లో సోదరులు ఇద్దరూ జనానికి అభివాదం చేస్తూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత నామినేషన్ పత్రాలను అందజేశారు. అభ్యర్థి చేత ప్రమాణం చేయించే వర కు కిషోర్ అభ్యర్థి అన్న విషయం మాజీ సీఎం సొంత మనుషులకూ తెలియలేదు.
కిరణ్ వర్గీయుల అసంతృప్తి
ఎన్నో ఏళ్లుగా నల్లారి కుటుంబాన్ని నమ్ముకుని సొంత మనుషులకూ తెలియకుండా కిషోర్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషం వరకు దాచి పెట్టడం అసంతృప్తికి దారితీసింది. బయటకు చెప్పుకోలేనప్పటికీ నల్లారి ముఖ్య అనుచరులు లోలోన కుతకుతలాడుతున్నారు. రాష్ట్ర విభజన ద్రోహిగా ముద్రవేసుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు సొంత మనుషుల నుంచి కూడా అదే ముద్ర వేసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సయయంలో రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజ ల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే.
ఈ ప్రభా వం సొంత నియోజకవర్గంలోనూ ఉంటుందనే భావనతో ముందుగానే పోటీ నుంచి వైదొలిగినట్లు చెబుతున్నారు. మాజీ సీఎంగా ఎన్నికల్లో ఓటమి భారం భరించడం కన్నా తప్పుకోవడమే ఉత్తమమని అభిప్రాయానికి వచ్చిన తర్వాతే సోదరుడు కిషోర్‌ని బరిలోకి దించారని అంటున్నారు. మొత్తానికి కిరణ్ అనుసరిస్తున్న వ్యూహం నేలవిడిచి సాముచేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.