సోనియమ్మకే సీఎం ద్రోహం చేశారు: జీవన్‌రెడ్డి
రాయికల్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ భిక్షతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమెకే ద్రోహం చేశారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మూటపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎలాంటి గుర్తింపు లేని కిరణ్‌ను సోనియాగాంధీ ముఖ్యమంత్రిని చేశారని, ఆమె తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె నిర్ణయాన్నే ఎదిరించిన ఘనుడు కిరణ్ అని మండిపడ్డారు. కేవలం అధికారం కోసమే సోనియాగాంధీ తెలంగాణ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది సీమాంధ్ర నాయకులు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలు ఉంటే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలే ఉన్న విషయం వారు మరిచినట్టున్నారన్నారు.
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆంధ్ర, రాయలసీమకు ఎలాంటి పరిహారం ఇస్తున్నారో... అలాగే తెలంగాణ రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని జీవన్‌రెడ్డి చెప్పారు.