ఇది చంద్రబాబు పాలన-2 : రోజా
మూడేళ్ల కిరణ్ పాలనపై వైఎస్సార్ సీపీ నేత రోజా ధ్వజం
కరెంటు, ఆర్టీసీ, గ్యాస్ ధరలన్నీ పెంచేశారు..
వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ నీరు గార్చేశారు
సమైక్య సింహం పేరుతో విభజన నేతగా మారారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వీర విధేయుడిగా ఉంటూ ఆమె కనుసన్నల్లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడేళ్ల పాటు సాగించిన పాలనలో గొప్పలు చెప్పుకోవడం తప్ప చేతల్లో ప్రజలకు చేసిందేమీలేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యురాలు, అధికార ప్రతినిధి ఆర్.కె. రోజా ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కిరణ్ పాలన అంతా 2004కు ముందు టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు పాలన-2 మాదిరిగా ఉంది తప్పితే ఏ మాత్రం ప్రజలకు మేలు జరుగలేదన్నారు.
వాస్తవానికి బాబు సలహాలతోనే కిరణ్ ఇలాంటి పాలనను కొనసాగించారని ఆమె అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రజలను తామేదో ముందుకు తీసుకువెళ్లామని కిరణ్ పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అమలును పూర్తిగా గాలికి వదిలేసిన కిరణ్.. అమలు చేసినవేమైనా ఉన్నాయి అంటే అవి, కరెంటు చార్జీలు పెంచడం, సర్‌చార్జిలను వడ్డించడం, ఆర్టీసీ బస్సు చార్జీలు, గ్యాస్ ధరలు పెంచడమేనని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం నుంచి 133 వ్యాధులను తొలగించిన ఘనత కిరణ్ సర్కారుదేనన్నారు. 108, 104 వాహనాలకు డీజిల్‌లేని పరిస్థితి, సిబ్బంది జీతాలివ్వని దుర్గతి ఆయన పాలనలోనేనని విమర్శించారు. వికలాం గుల, వితంతువుల, వృద్ధుల పెన్షన్లలో కోత విధించడం, ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు చెల్లించే ఫీజులపై పరిమితులు విధించి వారిని వేధించడం, వైఎస్ హయాంలో భారీగా చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణానికి నిధులివ్వకపోవడం కిరణ్ హయాంలోనే జరిగిందన్నారు.
వైఎస్ పథకాలకు కిరణ్ నీళ్లొదిలారు..
ప్రజల అవసరాలు ఏమిటో తెలుసు కనుక అందుకు అనుగుణంగా వైఎస్సార్ పథకాలను ప్రవేశపెడితే కిరణ్ వాటిని నిర్లక్ష్యం చేశారని రోజా అన్నారు. 2009 ఎన్నికల్లో వ్యవసాయ రంగానికి ఏడు నుంచి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, మరో పదికిలోలు అదనంగా సబ్సిడీ బియ్యం ఇస్తామని వైఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను కిరణ్ తుంగలో తొక్కారని ఆమె దుయ్యబట్టారు. ఇక రాష్ట్ర విభజన విషయానికి వస్తే.. పైకి సమైక్య సింహం మాదిరిగా పోజులు కొడుతూ లోలోపల ఢిల్లీ పెద్దలకు విభజనకు అన్ని విధాలా సహకరిస్తున్నారని ఆమె అన్నారు. కేంద్ర మంత్రివర్గం ముందుకు విభజన నోట్ రాకముందే అసెంబ్లీని సమావేశపర్చి సమైక్య తీర్మానం చేద్దామని తమ పార్టీ చెప్పినా కిరణ్ వినిపించుకోలేదని, నిజంగా ముఖ్యమంత్రి సమైక్యవాది అయి ఉంటే ఆ పని చేసేవారన్నారు.