కాంగ్రెస్, టీడీపీ నాయకులు సీమ పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల: కాంగ్రెస్, టీడీపీ నాయకులు సీమ పౌరుషాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన విషయంలో సీఎం కిరణ్, చంద్రబాబుల సంయుక్త డ్రామాలు ప్రజల్లో రక్తి కట్టడం లేదన్నారు. ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆ రెండు పార్టీల నాయకుల నోట్లో ప్యాకేజీల విషయం తప్ప మరొకటి రావడం లేదని విమర్శించారు.
రాష్ట్రం ఏమైపోతున్నా పట్టించుకోని చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ పడిపోకుండా కాపాడుకోవటమే ధ్యేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని.. అందువల్లే ఆయనపై పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎం కిరణ్ విభజనకు అనుకూలమని దిగ్విజయ్‌సింగ్ స్వయంగా ప్రకటించినా.. ఆయన మాత్రం తాను సమైక్యవాదినని ప్రకటించుకోవడంలో అర్థం లేదన్నారు. సమావేశంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పాల్గొన్నారు.