
గెలుపోటములపై నివేదిక
నంద్యాల, న్యూస్‌లైన్: నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ గెలుపునకు, బనగానపల్లె నియోజకవర్గంలో ఓటమికి కారణాలను త్రిసభ్య కమిటీ సభ్యులు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి నివేదికను అందజేయాలని నిర్ణయించినట్లు నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి తెలిపారు. రాజమండ్రిలో జరిగే వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుల సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన శనివారం ఇక్కడి నుంచి బయల్దేరారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తల అభిప్రాయాలను అసెంబ్లీల వారీగా తాను తెలుసుకున్నానన్నారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఓటు వేయడం వల్ల స్వల్ప మెజార్టీతోనైనా కొన్నిచోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించిందని కార్యకర్తలు వివరించారన్నారు. ఒక్క బనగానపల్లెలో మాత్రం స్థానిక కార్యకర్తలు వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారని, ప్రత్యర్థులు దుష్ర్పచారాన్ని ఉద్ధృతంగా చేపట్టి గెలుపొందారని కార్యకర్తలు వివరించినట్లు తెలిపారు.
నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, అసెంబ్లీ నియోజకవర్గాలు కేసీ కెనాల్ పరివాహక గ్రామాలు కావడంతో ఒకే రకమైన తీర్పును ప్రజలు అందజేశారన్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్పీవెరైడ్డిపై అనర్హత వేటు పడితే మళ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉండాలని తాను కార్యకర్తలను కోరానన్నారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుని రికార్డ్ సృష్టించిందని భూమా అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మృతి చెందిన శోభానాగిరెడ్డికి 18వేల మెజార్టీ రావడం అరుదైన సంఘటన అని వివరించారు.