
వచ్చే ఏడాది వేడుకలు జరుగుతాయో లేదో: కిరణ్
హైదరాబాద్ : రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని, వచ్చే ఏడాది మళ్లీ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయా? లేదా అనే
అనిశ్చితి, అయోమయం ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ జాతీయ జెండా ఎగురువేశారు. అనంతరం ముఖ్యమంత్రి క్లుప్తంగా, ముక్తసరిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..కలకాలం జరగాలని కోరుకుంటున్నట్లు కిరణ్ తెలిపారు.
సమైక్య రాష్ట్రంతోనే అభివృద్ధి జరుగుతుందన్న ముఖ్యమంత్రి రాష్ట్రం కలిసి ఉండటం వల్లే సాగునీటికోసం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రజెక్టులను నిర్మించుకోగలిగామన్నారు. బలమైన రాష్ట్రం ఉండటం వల్లే శాంతిభద్రతలు, ప్రజలకు రక్షణ మతసామరస్యాన్ని కాపాడగలుగుతున్నామన్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం ఎందరో త్యాగాలు చేశారని కిరణ్ అన్నారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పార్లమెంట్లో ఇందిరాగాంధీ ప్రసంగాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్లో తాను సమైక్యవాదినని ఇందిర గట్టిగా చెప్పారని, వందేళ్ల భవిష్యత్ను ఆమె ముందే ఊహించారన్నారు.