బంతి పడకుండానే... బ్యాటొదిలారు | Kiran Kumar Reddy failed to protect seemandhra People interests | Sakshi
Sakshi News home page

బంతి పడకుండానే... బ్యాటొదిలారు

Published Thu, Dec 19 2013 1:57 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

బంతి పడకుండానే... బ్యాటొదిలారు - Sakshi

బంతి పడకుండానే... బ్యాటొదిలారు

  • అడ్డుకుంటానంటూనే విభజనకు కిరణ్ పూలబాట
  •  సీమాంధ్ర నేతల మూకుమ్మడి ఆవేదన
  •  అంతా చేసి ఇప్పుడు
  •  రిటైర్డ్ హర్ట్ అయ్యారు
  •  పరిణామాలన్నింటి పరమార్థమదే
  •  కాంగ్రెస్ నేతల్లోనూ అంతర్మథనం
  • సాక్షి, హైదరాబాద్: ‘స్టార్ బ్యాట్స్‌మన్’ చేతులెత్తేశారా? బంతి పడకముందే బ్యాట్‌ను కింద పడేశారా? అడుగడుగునా ‘ఫిక్సింగ్’ నాటకాన్ని రంజుగా రక్తి కట్టిస్తూ వస్తున్నారా? చేయాల్సిందంతా చేసి, చివరికి తనకు తానే రిటైర్డ్ హర్ట్‌గా ప్రకటించుకుని పెవిలియన్ బాట పడుతున్నారా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై సీమాంధ్ర నేతల్లో ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని కొంతకాలంగా ప్రతి వేదికపైనా పదేపదే చెబుతూ వస్తున్న కిరణ్, వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. అంతేగాక ఈ విషయమై సోషల్ మీడియాలోనూ కిరణ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ మాటలకు, జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోతుండటంతో ఆయన చుట్టూ తిరుగుతున్న నేతలు కూడా తీవ్ర అయోమయంలో పడ్డారు. విభజనపై పరిస్థితిని సాగదీస్తున్నట్టు పైకి కనబడుతూనే, చివరికి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితులను కిరణ్ సానుకూలపరుస్తూవస్తున్నారన్న భావన వారిలో ఏర్పడింది. ముఖ్యంగా... ఏవైతే జరగవని ఆయన చెబుతూ వస్తున్నారో సరిగ్గా వరుసగా అవే జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలను కూడా చూపుతున్నారు.
     
    జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ, ‘విభజన జరగదు’ అంటూ ఒక్కో సందర్భంలో ఒక్కో అంశాన్ని తెరపైకి తెస్తూ కిరణ్ ఇప్పటికి నాలుగున్నర నెలలు గడిపారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని, తద్వారా విభజన ప్రక్రియ ఆగిపోతుందని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న రోజే నేతలంతా ప్రతిపాదించినా, ‘దాన్నివల్ల ప్రయోజనం ఉండద’ంటూ కిరణ్ దాటవేశారు. పైగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా విభజనకు ముందుకు వెళ్లలేరని నమ్మబలుకుతూ వచ్చారు. ఆ తీర్మానాన్ని ఓడించడానికైనా అందరూ పదవుల్లో ఉండాలంటూ నేతలకు నచ్చజెప్పారు.
     
    సీడబ్ల్యూసీ తీర్మానం చేసినా కేబినెట్ నోట్ తయారీ అంత సులభం కాదని, పైగా అది కేంద్ర మంత్రివర్గం ముందుకు అంత తొందరగా రాదని పేర్కొన్నారు. చివరికి విభజన నోట్ టేబుల్ ఐటంగా కేబినెట్ ముందుకు వచ్చేదాకా సీమాంధ్ర మంత్రులను, ఎమ్మెల్యేలను రోజుకో రకంగా మభ్యపెడుతూ వచ్చారు. నోట్‌ను కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించడమే గాక, బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం ఉండబోదని కూడా తేల్చేసింది. దాంతో, ‘తీర్మానముంటుంది.. ఓటింగ్ ఉంటుంది... బిల్లును ఓడిస్తాం’ అని అప్పటిదాకా చెబుతూ వచ్చిన కిరణ్ వాటన్నిటినీ పక్కనపెట్టి 371డి వంటి అంశాలను తెరపైకి తెచ్చి మరికొంత కాలం కథ నడిపారు.
     
     కాదు కాదంటూనే...
     ఒకవైపు విభజనకు అవసరమైన సమాచారమంతటినీ కేంద్ర మంత్రుల బృందానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూనే పైకి మాత్రం అదంత సులభం కాదని, సమస్యలన్నీ పరిష్కరించకుండా ముందుకు పోలేరని కూడా కిరణ్ బుకాయిస్తూ వచ్చారు. కానీ కేంద్ర మంత్రివర్గం విభజన బిల్లుకు ఆమోదముద్ర వేయడమే గాక ఆ మర్నాడే దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపింది. దాంతో అప్పటిదాకా కిరణ్ కేవలం అధిష్టానం ఆదేశానుసారమే తమతో నాటకీయంగా వ్యవహరిస్తూ వచ్చారన్న భానవ సీమాంధ్ర నేతల్లో బలంగా నాటుకుంది. అంతేగాక సరిగ్గా విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చే సమయానికి శాసనసభ సమావేశాలు జరిగేలా కూడా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహించారని సీమాంధ్ర నేతలంటున్నారు. రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యవధి ఆర్నెల్లకు మించకూడదు. సాధారణంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నవంబర్‌లోనే పూర్తి చేయొచ్చు. కానీ కిరణ్ మాత్రం విభజన బిల్లు ఢిల్లీలో ఓ కొలిక్కి వచ్చేదాకా అసెంబ్లీ సమావేశాల పట్ల ఆసక్తి చూపలేదు. సరిగ్గా బిల్లు అసెంబ్లీకి వస్తుందన్న సమాచారం అందాక, డిసంబర్ 12 నుంచి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
     
    13న విభజన బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్రానికి చేరింది. నిజానికి ఎప్పట్లా నవంబర్‌లోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ముగించి ఉంటే టీ బిల్లుపై చర్చ తదితరాలకు ఆస్కారమే ఉండేది కాదని సీమాంధ్ర నేతలంటున్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పొడగించాలని కోరడమూ వీలయ్యేదని చెబుతున్నారు. ఇవేమీ చేయకపోగా, అసెంబ్లీ నిర్వహణ విధివిధానాల ఖరారుకు 11న జరిగిన బీఏసీ సమావేశానికి కూడా కిరణ్ హాజరు కాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా హాజరు కాలేదు. విభజన బిల్లు సభలో ప్రవేశపెట్టాలని ఆ భేటీలో తీర్మానించారు. వారిద్దరు గనుక బీఏసీకి హాజరై ఉంటే, వారు ముందుగా అనుకున్నట్టే అసెంబ్లీసమావేశాలు డిసెంబర్ 14తో నిరవధికంగా వాయిదా పడేవి. వారు రాని కారణంగా డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితర తెలంగాణ నేతలు సమావేశాలను ఏడు రోజుల పాటు నిర్వహించాలని గట్టిగా పట్టుబట్టడం, అందుకు ఆమోదముద్ర పడటం జరిగిపోయాయని సీమాంధ్ర నేతలు వాపోతున్నారు.
     
    విభజన బిల్లుపై చర్చ ఈ సమావేశాల్లోనే మొదలవాలని అధిష్టానం ఆదేశించిన కారణంగానే కిరణ్ వ్యూహాత్మకంగా బీఏసీకి డుమ్మా కొట్టారని భావిస్తున్నారు. తీరా విభజన బిల్లుపై చర్చకు తేదీని ఖారారు చేసేందుకు మరోసారి నిర్వహించిన బీఏసీలో పాల్గొన్న కిరణ్, ‘బిల్లుపై చర్చ జరగాలి. దీనిపై మీ మీ అభిప్రాయాలు చెప్పండి’ అని ఆయా పార్టీలకు సూచించడం సీమాంధ్ర నేతలను విస్మయపరిచింది! పైగా విభజన బిల్లుపై చర్చను మూడు విడతలుగా చేపట్టాలన్న సీఎం సూచనపైనా సీమాంధ్ర నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఇచ్చిన గడువును పూర్తిగా ఉపయోగించుకుంటామన్న కారణం చూపి మొత్తం మీద బిల్లుపై విస్తృత స్థాయి చర్చ జరిగినట్టు చూపేందుకే ఈ ప్రతిపాదన తెచ్చారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    నాయకత్వానికి వ్యతిరేకంగా చిన్న మాటన్నా షోకాజులు, సస్పెన్షన్లకు దిగడం కాంగ్రెస్ అధిష్టానానికి రివాజు. అలాంటిది, నేరుగా అధిష్టానాన్నే ధిక్కరిస్తున్నట్టుగా కిరణ్ పైకి ఎన్ని వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినా పెద్దలు చూసీ చూడనట్టు పోయిందంటే, అంతా హస్తిన స్క్రిప్టు ప్రకారమే జరిగిందని చెప్పకనే చెప్పినట్టేనన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ శిబిరం నుంచే విన్పిస్తున్నాయి. క బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే కీలక సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ వచ్చి, బిల్లుపై చర్చకు ఏ రోజున బీఏసీ భేటీ జరగాలి మొదలుకుని పలు అంశాలపై ‘దిశానిర్దేశం’ చేయడాన్ని అంతా గమనించారని సీమాంధ్రకు చెందిన మంత్రి ఒకరు నిర్వేదంగా వ్యాఖ్యానించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement