సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ‘అనంత’ కాంగ్రెస్ నేతలు ఝలక్ ఇచ్చారు. ఈ నెల 12న తాను స్థాపించే కొత్త పార్టీలో చేరాలని గురువారం ‘ఫోన్’లో కాంగ్రెస్ నేతలను కిరణ్ ఆహ్వానించారు. కానీ.. అధిక శాతం మంది ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కిరణ్ ఇప్పుడు కొత్త పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలకు ఆయన ఫోన్ చేసి.. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కిరణ్‌తో ఆది నుంచి స్నేహంగా ఉన్న రఘువీరా.. రెండేళ్ల క్రితం విభేదించారు.
గురువారం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ద్వారా రఘువీరాతో కిరణ్ ఫోన్‌లో మాట్లాడే యత్నం చేశారు. కానీ.. కిరణ్‌తో మాట్లాడేందుకు రఘువీరా నిరాకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డికి కిరణ్ నేరుగా ఫోన్ చేసి.. తమతో కలిసి నడవాలని కోరగా.. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగదల్చుకున్నానని ఎంపీ తెగేసి చెప్పడంతో కిరణ్ షాక్ తిన్నారు.
మొదట్లో కిరణ్‌ను సమర్థించిన గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా ఇప్పుడు నిరాకరించారు. మడకశిర ఎమ్మెల్యే సుధాకర్ కూడా తాను రఘువీరానే అనుసరిస్తానని కిరణ్‌కు స్పష్టీకరించారు. జేసీతో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిని కూడా తన వైపునకు తిప్పుకునేందుకు కిరణ్ చేసిన యత్నాలు వికటించాయి. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కూడా కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. రఘువీరాతో విభేదించిన తర్వాత కిరణ్.. ఏడాదిన్నర కాలంగా సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు.
ఒకానొక దశలో కిరణ్‌తో కలిసి జేసీ దివాకర్‌రెడ్డి సాగుతారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ కొత్త పార్టీని స్థాపించడంపై కిరణ్ నిర్వహించిన చర్చల్లో కూడా పాల్గొన్నారు. తనతో కలిసి నడుస్తారనే నెపంతోనే జేసీ దివాకర్‌రెడ్డి సన్నిహితులకు చెందిన త్రిశూల్ సిమెంట్స్‌కు కేటాయించిన సున్నపురాళ్ల గనుల లీజును కూడా పొడిగించినట్లు అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ.. టీడీపీలో తనకు బెర్తు ఖరారు కావడంతో కిరణ్‌కు జేసీ దివాకర్‌రెడ్డి మొహం చాటేశారు.
మాజీ మంత్రి శైలజానాథ్‌కు కిరణ్ భారీ ఎత్తున లబ్ధి చేకూర్చినట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. శైలజానాథ్‌కు వైద్యం కోసం రూ.40 లక్షలను అధికారికంగా మంజూరు చేయడాన్ని అందుకు తార్కాణంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సాన్నిహిత్యంతో శైలజానాథ్ ఒక్కరైనా తనతో నడుస్తారని కిరణ్ భావిస్తున్నారు. కానీ.. శైలజానాథ్ అందుకు సుముఖంగా లేనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బెర్తు ఖాళీ లేకపోవడంతో.. టీడీపీ వైపు చూస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ద్వారా టీడీపీ టికెట్ సాధించేందుకు శైలజానాథ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతుండటం గమనార్హం. ఒకవేళ శైలజానాథ్‌కు కూడా మరో పార్టీలో బెర్తు ఖరారైతే.. జిల్లా నుంచి కిరణ్ వెంట ఒక్కరు కూడా నడిచే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కరంటే ఒక్కరేరీ?
Published Fri, Mar 7 2014 3:50 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement