సాక్షి ప్రతినిధి, అనంతపురం : మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోనియా డెరైక్షన్ మేరకు కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి జిల్లా నుంచి ఎవరెవరు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. నిన్న మొన్నటి వరకు కిరణ్ వెంట నడిచిన వారు కొత్త పార్టీలో చేరే అవకాశాలు తక్కువేనన్న భావన వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర నుంచి కిరణ్‌తో విభేదిస్తున్న రఘువీరారెడ్డి తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి సైతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు.
కిరణ్‌తో సాన్నిహిత్యం పెంచుకుంటూ వచ్చిన జేసీ దివాకరరెడ్డి.. కొత్త పార్టీ చర్చల్లో పాల్గొన్నా ఆ పార్టీలో చేరేదీ, లేనిదీ స్పష్టం చేయలేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేసీ దివాకరరెడ్డిని అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ తరఫున బరిలోకి దించాలని నిర్ణయించడంతో.. ఆ పార్టీలోకి జేసీ చేరడం ఖాయంగా కన్పిస్తోంది. ఇన్నాళ్లూ కిరణ్ వెంటే ఉన్న శైలజానాథ్ కూడా టీడీపీలో చేరుతారన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
తనకు సన్నిహితుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ద్వారా టీడీపీలోకి చేరే అంశంపై జేసీ బ్రదర్స్‌తో శైలజానాథ్ మంతనాలు సాగించినట్లు సమాచారం. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో కూడా శైలజానాథ్ చర్చలు సాగించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శైలజానాథ్ కొత్త పార్టీలో చేరుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న అంబికా లక్ష్మినారాయణ ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు.
డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా మాజీ మంత్రి రఘువీరాను అనుసరించేందుకే ఆసక్తి చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, పాటిల్ వేణుగోపాల్‌రెడ్డిలు కాంగ్రెస్‌లోనే ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. కాగా ఇతర పార్టీల నుంచి కిరణ్ స్థాపించే కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు ఎవరూ బహిరంగంగా ముందుకు రాకపోవడం కొసమెరుపు.
కిరణ్ వెంట నడిచేదెవరు?
Published Sat, Mar 1 2014 2:13 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement