సీఎంగా కిరణ్‌కు చివరి రోజు?
తెల్లవారులూ ఫైళ్ల క్లియరెన్స్!!
మంత్రులు, ప్రజాప్రతినిధులు, పైరవీకారుల హడావుడి
సచివాలయం, సీఎం పేషీ, క్యాంప్ ఆఫీసుల్లో ఒకటే సందడి
క్యాంపు కార్యాలయానికి వందల సంఖ్యలో ఫైళ్ల తరలింపు
రెండు రోజులుగా ‘కావాల్సిన ఫైళ్ల’ను క్లియర్ చేస్తున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన రోజునే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి తన సన్నిహితులతో చెప్పటంతో బుధవారం రాష్ట్ర సచివాలయం, మంత్రుల పేషీలు, ముఖ్యమంత్రి పేషీ, సీఎం క్యాంపు కార్యాలయాలు ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. గురువారం నాడు లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో.. కిరణ్ సీఎం పదవిలో ఇక ఒక్క రోజే ఉంటారని.. కాబట్టి బుధవారం తెల్లవారే లోగా ‘కీలక’ ఫైళ్లకు ఆమోదం పొందాలనే హడావిడి మొదలైంది. ఒకవైపు సీఎం తనకు ‘కావలసిన’ ఫైళ్లను ఆగమేఘాలమీద ఆమోదిస్తుండగా.. వివిధ పనుల కోసం, పైరవీల కోసం వచ్చిన వారు, ప్రజాప్రతినిధులతో జాతరను తలపించే సందడి నెలకొంది. తమకు చెందిన పనులకు సంబంధించిన ఫైళ్లను బుధవారం రాత్రి నుంచి తెల్లారేలోగా ఆమోదింపచేసుకోవాలనే హడావిడి సచివాలయానికి వచ్చిన వారిలో కనిపించింది.
సీఎం కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఫైళ్లు క్యాంపు కార్యాలయానికి తరలించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖకు చెందిన భూముల కేటాయింపు ఫైళ్లపై ముఖ్యమంత్రి గత రెండు రోజులుగా ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వివిధ రకాల భూముల కోసం దరఖాస్తు చేసుకున్న బడా నేతలకు చెందిన ఫైళ్ల క్లియరెన్స్‌పైనే ఆయన దృష్టి సారించినట్లు చెప్తున్నారు. బుధవారం సాయంత్రం కొన్ని ఫైళ్లను క్యాంపు కార్యాలయానికి తరలిస్తుండగా మీడియా దృష్టిలో పడింది. దీంతో ఫైళ్ల తరలింపును తాత్కాలికంగా ఆపేశారు. మీడియా ప్రతినిధులు సచివాలయం నుంచి వెళ్లిపోయిన తరువాత రాత్రికి ఫైళ్లను క్యాంపు కార్యాలయానికి తరలించారు. రకరకాల మినహాయింపులతో పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే ఫైళ్లకు ఒక్కసారిగా రెక్కలొస్తున్నారుు. ఇప్పటివరకు నత్తనడకన కదిలే ఫైళ్లు ఇప్పుడు జెట్ స్పీడుతో పరిగెడుతున్నాయి.
మరో పక్క బదలీలు, పదోన్నతులకు చెందిన ఫైళ్లపై సంబంధిత ఉద్యోగులు హడావిడి పడుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మొత్తం మంత్రివర్గం ఉండదని, అలాంటప్పుడు ఏ పనీ కాదనే భావనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. మంత్రులు కూడా తమకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి ఆమోదం కోసం సీఎం కార్యాలయానికి తమ కార్యాలయ అధికారులను పంపిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆమోదం పొందిన ఫైళ్లకు ఇంకా జీవోలు జారీ కాకపోవటంతో అందుకు సంబంధించిన వ్యక్తులు సచివాలయంలోని ఆయా శాఖల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే జీవోలు జారీ అవుతాయో లేదో అనే ఆందోళనలో వారు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అధికారులు సీఎం పేషీలోనే సంతకాల కోసం వేచివుండటం కనిపించింది.