-
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ నరసింహన్‌కు లేఖ
-
అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడానికినిరసనగా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
-
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండలేనని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని వినతి
-
కిరణ్‌కుమార్‌రెడ్డి వెంట రాజ్‌భవన్‌కు వెళ్లిన 8 మంది మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు..
-
సాయంత్రానికి మిగిలింది పితాని, ఈలి
-
బుధవారం రాత్రి వరకు ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదించని గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి ఈ మేరకు లేఖను అందజేశారు. కేంద్రం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించినందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నానని అందులో పేర్కొన్నారు. బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావే శాన్ని నిర్వహించిన అనంతరం కిరణ్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంత్రులు పితాని సత్యనారాయణ, సాకే శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కె.పార్థసారథి, కాసు కృష్ణారెడ్డి, మహీధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, వీరశివారెడ్డి, లబ్బి వెంకటస్వామి, అన్నా రాంబాబు, పంతం గాంధీమోహన్, ఈలి నాని, ఎర్రం వెంకటేశ్వరరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి, మల్లాది విష్ణు, బంగారు ఉషారాణి, ఉగ్రనరసింహారెడ్డి, కొర్ల భారతి, వెంకటరామయ్య, మండలిలో చీఫ్‌విప్ రుద్రరాజు పద్మరాజు, విప్ రెడ్డపరెడ్డి, సభ్యులు పాలడుగు వెంకటరావు, శ్రీనివాసులు నాయుడు, చెంగల్రాయుడు, మాజీ ఎంపీ గునుపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి తదితరులు సీఎం వెంట ఉన్నారు.
కిరణ్ రాజీనామా లేఖను సమర్పించడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా గవర్నర్ ఆయనకు సూచించారు. తాను కొనసాగలేనని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆయనకు వివరించారు. రాజ్‌భవన్ నుంచి ముఖ్యమంత్రి తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన వెంట వచ్చారు. గవర్నర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఉన్న సంఖ్య తిరిగి వచ్చేటప్పటికి సగానికి పైగా తగ్గిపోయింది. నలుగురు మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగలగా సీఎం వారితో చర్చించారు. సాయంత్రానికి సీఎం దగ్గర మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని మాత్రమే మిగిలారు. ఇలావుండగా సీఎం రాజీనామాను గవర్నర్ బుధవారం రాత్రివరకు ఆమోదించలేదు. మరోవైపు కిరణ్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి సొంత ఇంటికి మకాం మార్చారు. సీఎంకు ఎప్పుడూ వెన్నంటే ఉండే సంగారెడ్డి ఎమ్మెల్యే, విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిలు చివరి నిమిషంలో క్యాంపు కార్యాలయంలో కనిపించకపోవడం విశేషం. రాజ్‌భవన్‌కు, అక్కడినుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు అధికారిక వాహనంలో వచ్చిన మంత్రి శైలజానాధ్ ఆ తర్వాత తిరిగి వెళుతున్నప్పుడు మాత్రం ఆటోలో వెళ్లారు.
రాజీనామా లేఖలో ఏముందంటే...
‘‘తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన తీరు రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక, విధానం లేదు. ఎలాంటి హేతుబద్ధతా లేదు. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన, ఎలాంటి సంప్రదాయాలను, విధివిధానాలను కానీ పాటించని విభజన విధానం రాజ్యాంగ విరుద్ధం. ఏకపక్షం. అహేతుకం. రాష్ట్ర ప్రజల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే విభజనకు పూనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభలు రాష్ట్రంపైనా, అసెంబ్లీపైనా ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం, లోక్‌సభ సభ్యుల సస్పెన్షన్ తీరు, వారికి అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం ఇవ్వకపోవడం నన్ను విభ్రాంతికి గురిచేసింది. లోక్‌సభ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించిన తీరు, మన పార్లమెంటరీ వ్యవస్థలలోని ప్రమాణాలను పాతరేసే కొత్త పోకడలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి నా మనస్సాక్షి అంగీకరించడం లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి నేను నా రాజీనామాను సమర్పిస్తున్నాను. ఎటువంటి జాప్యమూ లేకుండా తక్షణమే రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా బాధ్యతల నిర్వహణలో మీరందించిన సహకారానికి ధన్యవాదాలు’’ అని సీఎం గవర్నర్ కు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పదవికీ రాజీనామా...
ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమేరకు లేఖను అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీ వర్గాలను సంప్రదించగా రాజీనామా లేఖ తమ సచివాలయానికి రాలేదని, స్పీకర్ కార్యాలయానికి నేరుగా వెళ్లి ఉండవచ్చని తెలిపాయి. పార్టీకి కూడా రాజీనామా చేస్తూ లేఖను ఏఐసీసీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారని కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు చెప్పారు.
మూడేళ్ల రెండు నెలలకు పైగా..
2009 ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావడంతో 13వ అసెంబ్లీకి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో మారిన రాజకీయ పరిణామాల్లో ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య సీఎం అయ్యూరు. రోశయ్య రాజీనామా తరువాత 2010 నవంబర్ 25న కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎం కావడంపై అప్పట్లో కాంగ్రెస్‌లోనే పలురకాల ప్రచారాలు జరిగాయి. రోశయ్యపై తప్పుడు నివేదికలు పార్టీ హైకమాండ్‌కు పంపి ఆయన దిగిపోయేలా చేశారని, చిదంబరం ఆశీస్సులతో సీఎం అయ్యారని పలువురు సీనియర్ నేతలు పరోక్షంగా ఆరోపణలు చేశారు. సీఎం అయ్యాక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పలు కీలక ఘట్టాల్లో కిరణ్ వ్యవహరించిన తీరు తెలంగాణ నేతల తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సొంత కేబినెట్లో కూడా ఒకరిద్దరు తప్ప కిరణ్‌కు గట్టిగా మద్దతునిచ్చే వారే కరువయ్యారు. సఖ్యత కొరవడటంతో పీసీసీ అధ్యక్షుడికి, ఆయనకు మధ్య నిత్య వివాదాలు నడిచాయి. వివాదాల మధ్యనే మూడేళ్ల రెండు నెలల 24 రోజుల పాటు కిరణ్ సీఎంగా కొనసాగారు.