కిరణ్ జన్య విభజన ప్రక్రియ | Kiran kumar reddy supports high command agenda on bifurcation | Sakshi
Sakshi News home page

కిరణ్ జన్య విభజన ప్రక్రియ

Published Wed, Oct 9 2013 12:55 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్ జన్య విభజన ప్రక్రియ - Sakshi

కిరణ్ జన్య విభజన ప్రక్రియ

సమైక్య ఉద్యమానికి స్వయంగా గండి కొడుతున్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ నేతలతో పాటు ఉద్యమకారుల్లో కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి తన సహచర నేతలను ఇంతకాలం మభ్యపెట్టారన్న అనుమానాలు పార్టీలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయన చెబుతున్న మాటలు, చేతలు చూస్తున్న నేతలు తెర వెనుక వేరే ఎజెండాతో ముందుకు వెళుతున్నారని అంటున్నారు. రాష్ట్ర విభజన జరగనే జరగదని ఆయన చెబుతున్న ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం విభజన దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాయి! నిజానికి విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేసే బాధ్యతను హైకమాండ్ కిరణ్‌పైనే పెట్టిందని, దానికి అనుగుణంగానే ఆయన ఒక్కో వ్యవహారాన్నీ పథకం ప్రకారం ‘చక్కదిద్దుకుంటూ’ వస్తున్నారని తెలుస్తోంది. మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేయడానికి విభజనను వ్యతిరేకిస్తున్నట్లుగా, అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లుగా పైకి ప్రకటనలు చేస్తూ, లోలోపల మాత్రం ఢిల్లీ పెద్దల ఎజెండాను కిరణ్ తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వ్యక్తమవుతోంది. అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవడమే తప్ప తీర్మానం ఉండబోదని కేంద్ర మంత్రులే కుండబద్ధలు కొడుతున్నా కిరణ్ మాత్రం అన్నింటికీ ‘అసెంబ్లీ తీర్మానం’ పేరు చెప్పి సహచర నేతలు, ప్రజాప్రతినిధులను నిలువరిస్తూ, ‘అధిష్టానం కార్యాన్ని’ చడీచప్పుడూ లేకుండా చక్కబెడుతూ వస్తున్నారని ఇప్పుడు అంతా అనుమానిస్తున్నారు. సోమవారం జాతీయ మీడియాతో కూడా కిరణ్ మరోసారి అవే మాటలు చెప్పుకొచ్చారు.
 
 ఇతర రాష్ట్రాల విభజన విషయంలో అనుసరించిన విధానాలు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం తీర్మానం అసెంబ్లీకి రావాల్సిందేనన్నారు. అంతేగాక తాజాగా మంగళవారం సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చల సందర్భంగా కూడా కిరణ్ అదే పాట పాడారు. ‘నేనూ సమైక్యవాదినే. తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిస్తాం’ అని వారితో కూడా చెప్పుకొచ్చారు! ఇదంతా అధిష్టానం ఆదేశానుసారం ఆయన ఆడుతున్న గేమ్‌లో భాగమేనని తమకు ఆలస్యంగా అర్థమవుతోందంటూ సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు వాపోయారు. విభజన ప్రకటన నుంచి జరుగుతున్న పరిణామాలు, కిరణ్ వ్యవహార శైలిని గమనిస్తే ఈ విషయం ఎవరికైనా బోధపడుతుందని అన్నారాయన. సీడబ్ల్యూసీ చేసిన రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత 8 రోజుల అనంతరం నింపాదిగా మీడియా ముందుకొచ్చి సీమాంధ్ర సమస్యలను వల్లె వేసిన కిరణ్.. ఆ తర్వాత సరిగ్గా మళ్లీ 50 రోజుల తర్వాత మీడియా సమావేశ పెట్టి షరామామూలుగా సీమాంధ్ర సమస్యలను ఏకరువు పెట్టడం తెలిసిందే. ఇలా అప్పుడప్పుడూ తెరపైకి వచ్చి మాట్లాడటం ద్వారా తాను సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడ్డట్టుగా చెప్పుకుంటూ, లోలోపల మాత్రం విభజన ప్రక్రియలో అధిష్టానానికి అన్నివిధాలా కిరణ్ సహకరిస్తున్నారని చెబుతున్నారు. నిజానికి అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండానే తెలంగాణపై కేబినెట్ నోట్‌ను కేంద్రం ఆమోదించవచ్చనే సంకేతాలు రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. నోట్ రాకముందే తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత కిరణ్‌తో సమావేశమైన సందర్భంగా కొందరు మంత్రులు ఈ ప్రతిపాదనను ప్రస్తావించగా ఆయన దాన్ని నాటకీయంగా దాటవేసినట్టు సమాచారం. ఆ తర్వాత అందరి అనుమానాలనూ నిజం చేస్తూ అసెంబ్లీ తీర్మానంతో నిమిత్తం లేకుండానే కేబినెట్ నోట్‌ను కేంద్రం సిద్ధం చేయడం, మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి! నిజానికి తెలంగాణ విభజనకు నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగిన రోజే కిరణ్‌కు అధిష్టానం చెప్పింది! ఆ తర్వాత సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు కూడా అదే సమాచారాన్ని ఆయనకు ఇచ్చింది. అయినా ఆయన మాత్రం తనకు ఈ విషయాలేవీ అసలే తెలియదవన్నట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా అప్పట్లో మీడియాకు ఆయన లీకులివ్వడం కూడా అధిష్టానం గేమ్‌లో భాగమేనంటున్నాయి.
 
 ఇదీ సంప్రదాయం!
 సాధారణంగా రాష్ట్రాన్ని విభజించాలంటే ముందు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత దాని ఆధారంగానే కేబినేట్ నోట్ ముసాయిదా తయారవుతుంది. కానీ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో పని లేకుండానే కేంద్ర ప్రభుత్వం, హోం శాఖ కేబినేట్ నోట్‌ను రూపొందించడమే కాకుండా మంత్రిమండలి దాన్ని యథాతథంగా ఆమోదించింది కూడా! ఆ లెక్కన అసెంబ్లీ తీర్మానం ఇక లేనట్టేనని తేలిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి కూడా కేంద్ర మంత్రిమండలి సమావేశం అనంతరం ఒకసారి, రెండు రోజుల కిందట హైదరాబాద్ సందర్శించినప్పుడు రెండోసారి చాలా స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీ తీర్మానం ఘట్టం లేకుండానే కేబినెట్ నోట్ ఆమోదం పొందిందని, ఇక రెండో క్రమంలో ఆ ముసాయిదా కేవలం అసెంబ్లీ అభిప్రాయం కోసం రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వస్తుందని ఆయన చాలా స్పష్టంగా విడమరిచారు. అసెంబ్లీ అంగీకారం, వ్యతిరేకతలతో నిమిత్తం లేకుండానే విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుటుందని కూడా కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ కిరణ్ మాత్రం తీర్మానం కోసం అసెంబ్లీకి వస్తుందని ఇంతకాలం మాదిరిగానే ఇప్పుడు కూడా పార్టీ నేతలకు చెబుతున్నారని, ఎవరూ రాజీనామా చేసి సంక్షోభం సృష్టించవద్దని, అసెంబ్లీకి వచ్చినప్పుడు తీర్మానాన్ని అడ్డుకోవచ్చంటూ మభ్యపెట్టజూస్తున్నారని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తీర్మానం అసెంబ్లీ ఆమోదం పొందాలని ఇంతకాలం సీఎం చెబుతుంటే నిజమేనేమో అని నమ్మాం. జైపాల్‌రెడ్డి చెప్పిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో సీఎం మా అందరినీ డార్క్‌లో పెట్టారు’ అంటూ ఒక మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నాయకత్వంలో రాష్ట్ర విభజన జరగదని సీఎం చెబితే ఏదో చోట ప్రక్రియ అగిపోతుందని భావించామని, అయితే తెర వెనుక మొత్తం ప్రక్రియను సాఫీగా నడిపించే ప్రయత్నాల్లో కిరణ్ తలమునకలయ్యారని ఆలస్యంగా గ్రహించామని నేతలంటున్నారు. ‘విభజనకు సంబంధించి ఏయే పరిణామాలైతే జరగబోవని కిరణ్ చెబుతూ వచ్చారో, సరిగ్గా అవే పరిణామాలు ఆ వెంటనే జరుగుతూ వస్తున్నాయి. ఈ లెక్కన కిరణ్ తన హయాంలో విభజన జరగదని అంటున్నారు గనుక అందుకు సరిగ్గా వ్యతిరకంగా ఆయన చేతుల మీదుగానే రాష్ట్రం రెండు ముక్కలయ్యేలా ఉంది’ అంటూ వారు విశ్లేషిస్తున్నారు! విభజన నిర్ణయం అనంతరం కిరణ్ మీడియా ముందుకు వచ్చిన రెండుసార్లూ అధిష్టానమంటే లెక్క లేదన్న స్థాయిలో ధిక్కరించి మాట్లాడినా పెద్దలెవరూ పట్టించుకోలేదంటే ఇదంతా వారి కనుసన్నల్లోనే నడుస్తున్న వ్యవహారమని తేలిపోతోందని నేతలు చెబుతున్నారు.
 
 మొదటి నుంచీ వ్యూహాత్మకమే!
 ఉద్యమం ఉవ్వెత్తున సాగితే విభజన ప్రక్రియను కేంద్రం సాఫీగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుండదు. ఇప్పటికే ఉద్యోగులు, సామాన్య ప్రజలు కలసి ఉద్యమాన్ని సాగిస్తున్నారు. దానిలోకి రాజకీయ నేతలు కూడా చేరితే మరింతగా విసృ్తతమవుతుంది. అదే జరిగితే ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉద్యమం బాట పడితే ప్రభుత్వం అనిశ్చితిలో పడడంతో పాటు ఉద్యమం కూడా ఉవ్వెత్తున పైకి లేస్తుంది. అప్పుడు విభజనపై కేంద్రం కూడా కొంత వెనుకడుగు వేస్తుంది. అందుకే అలా ఉద్యమం ఉధృతం కాకుండా కిరణ్ మొదటి నుంచీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న మాట పార్టీలో బలంగా వినిపిస్తోంది. పైకి ఒక మాట చెబుతూ, లోపల మాత్రం రహస్య ఎజెండాను అనుసరిస్తూ పార్టీ పెద్దల నిర్ణయాలు, కేంద్రం చర్యలు సాఫీగా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారన్న అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ‘‘తెలంగాణ చాలా జటిలమైన అంశం. రాష్ట్ర విభజన అంత సులభం కాదు. సీడబ్ల్యూసీ అంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ నోట్ తయారీ కూడా అంత సులభం కాదు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతిపదికను చెప్పడం, పీఠికను పొందుపర్చడం సాధ్యమయ్యేదే కాదు. తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రానే రాదు..’’ ఇలా కొంతకాలంగా కిరణ్ రకరకాలుగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ ఆయన అలా ప్రకటన చేసిన ప్రతి సందర్భంలోనూ సంబంధిత ఘట్టాన్ని కేంద్రం చకచకా ముగించుకుంటూ పోయింది! ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం సమైక్య ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చకుండా చూసుకుంటూ, కేంద్రానికి విభజన మార్గం సుగమం అయ్యేలా సీఎం సహకరిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేయగానే సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. అదే సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలు చేస్తే అది తారస్థాయికి చేరేది. సీడబ్ల్యూసీ తీర్మానంపైనే పార్టీ పునరాలోచనలో పడేందుకు ఆస్కారముండేది. కానీ కిరణ్ మాత్రం తొలినుంచీ వారికి రాజీనామాలు చేయొద్దంటూ చెబుతూ వచ్చారు. అలా వాటిని ఆయన వ్యూహాత్మకంగా అడ్డుకోవడంతో తీర్మానం కాస్తా కేంద్రం వద్దకు చేరుకోవడం, తెలంగాణ ప్రక్రియను కేంద్రం ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఆ తరవాత కూడా రాజీనామాలకు ఉద్యమకారుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చినా సీఎం వారినీ మభ్యపెట్టేలా ప్రకటనలు చేశారు. అసెంబ్లీలో, పార్లమెంటులో తెలంగాణ అంశం చర్చకు వస్తే అక్కడ దానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో పాటు బిల్లును అడ్డుకోవడానికి అందరూ సభల్లోనే ఉండాలని, రాజీనామాలు చేస్తే ఆ అవకాశాన్ని కోల్పోతామని వారికి చెప్పుకుంటూ వచ్చారు. చివరకు ఢిల్లీలో సీమాంధ్ర ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయడానికి సమాలోచనలు సాగిస్తున్న సమయంలోనూ సీఎం వారిని పిలిచి రాజీనామాల నిర్ణయం సరికాదని వారిని వెనక్కు తగ్గేలా చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానం తరువాత మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయి రాజీనామాలు చేయాలని తీర్మానం చేసినా, తీరా ఆ సాయంత్రం కిరణ్‌తో భేటీ కాగానే వారి నిర్ణయం కాస్తా మారిపోయింది. వారిపై కూడా ‘అసెంబ్లీలో తీర్మానం, పార్లమెంటులో అడ్డుకోవడం’ కార్డును ప్రయోగించి కిరణ్ వెనక్కు లాగారు. పైగా తెలంగాణపై కేంద్రం ముందుకు పోతున్న పలు సందర్భాల్లో అందుకు నిరసనగా సీమాంధ్ర మంత్రులు రాజీనామాలకు సిద్ధపడటం, కొందరు రాజీనామా పత్రాలను కిరణ్‌కే ఇవ్వడం తెలిసిందే. కానీ ఆయన మాత్రం వాటిని ఆమోదించకుండా తన దగ్గరే పెండింగ్‌లో పెట్టారు. ఒకరిద్దరు మంత్రులు వాటి ఆమోదానికి ఒత్తిడి చేసినా పాత కథే విన్పిస్తూ మభ్యపెడుతూ వచ్చారు. కేబినెట్ నోట్ విషయంలో కూడా ఇలాగే వారిని డార్క్‌లో ఉంచారు. తెలంగాణపై నోట్ రూపొందించడం సులభం కాద ని, అది కేబినెట్ వరకు ఇప్పట్లో రానే రాదని నమ్మబలుకుతూ వచ్చారు. కానీ తీరా కేబినెట్ నోట్‌ను కేంద్ర హోం శాఖ రూపొందించడంతోపాటు అక్టోబర్ 3న అది కేబినెట్ ఆమోదం కూడా పొందింది! అలా జరగనుందంటూ అంతకు ముందు రోజే మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినా కిరణ్ మాత్రం అలాంటిదేమీ లేదంటూ షరామామూలుగానే నేతలకు చెప్పుకొచ్చారు. ఇక అసెంబ్లీకి తీర్మానం వచ్చే అవకాశమే లేదని స్పష్టమవుతున్నా సీఎం ఇప్పటికీ, ‘తీర్మానం వస్తుంది’ అంటూ నమ్మబలుకుతున్నారు. అసెంబ్లీ ముందుకు రాగానే దాన్ని ఓడిద్దామంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయకుండా అడ్డుకుంటున్నారు. ‘‘మా రాజీనామాలతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. విభజన ప్రక్రియపైనా అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తెలంగాణపై కేంద్రం అంత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు వీలుండదు. ఇదంతా జరగకుండా, కేంద్రం తన విభజన అజెండాను సాఫీగా ముందుకు తీసుకెళ్లాలంటే వీలైనంత కాలం ఎవరూ రాజీనామాలు చేయకుండా చూడాలనే ఉద్దేశంతోనే మా రాజీనామా యత్నాలను కిరణ్ నిరుత్సాహపరుస్తూ వచ్చారు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు మథనపడుతున్నారు.
 
 సమైక్యోద్యమాన్ని దారిలోకి తెస్తా!
 సీమాంధ్రలో రెండు నెలలకు పైగా ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమాన్ని కూడా ‘దారిలోకి’ తెస్తానని కిరణ్ ఇప్పటికే హైకమాండ్ ముందు తన వ్యూహాన్ని ఉంచినట్టు చెబుతున్నారు. ‘అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకోవడం ద్వారా విభజనను అడ్డుకోవచ్చు’ అంటూ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇంతకాలం వెనక్కు లాగినట్టుగానే, అదే హామీతో ఉద్యోగులను కూడా కన్విన్స్ చేస్తానని ఢిల్లీ పెద్దలకు ఆయన చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీలో తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసి అడ్డుకోవాలంటూ ఏపీ ఎన్జీవోలు పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో ఇప్పుడు దాన్నే ప్రధానాంశంగా వారి ముందు పెట్టడం ద్వారా వారు ఆందోళన విరమించేలా ఏదో రకంగా చర్యలు తీసుకుంటానని హైకమాండ్‌కు కిరణ్ వివరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement