కేంద్రంపై అవిశ్వాసం నెగ్గాలని కిరణ్ కోరుకుంటున్నారు: గంటా
పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వంపై పెడుతున్న అవిశ్వాసం నెగ్గాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నట్లు రాష్ట్ర మౌలిక సదుపాయాలు, ఓడరేవుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ పని ఇక అయిపోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్లే ఇప్పటివరకు ఎంతో కొంత మేరకు పార్టీ బతికుందని అన్నారు.
తానేం చెప్పిందో అదే చేయాలనుకుంటోంది తప్ప నాయకులు, ఎవరి మాటా పట్టించుకోవట్లేదని, తెలంగాణ బిల్లును తప్పకుండా ఓడిస్తామని ఆయన అన్నారు. ఎలాంటి ప్రభుత్వ పదవీ లేని దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం మాటగా చెబుతుంటే, అధికారంలో ఉన్న షిండే మాత్రం పార్టీ మాట చెబుతున్నారని ఆయన విమర్శించారు. కేబినెట్ సమావేశానికి గడువు కావాలని ఇద్దరు మంత్రులు అడిగినా పట్టించుకోలేదని, ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని గంటా మండిపడ్డారు. అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలంతా కూడా ఐక్యంగానే ఉండాలి తప్ప కొందరు అధిష్ఠానానికి అనుకూలంగా ఉంటామని అనకూడదని తెలిపారు.