కిరణ్‌పై అవిశ్వాసానికి శంకర్రావు నోటీసు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే పి. శంకర్రావు అవిశ్వాసం ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి ఈమేరకు నోటీసు ఇచ్చారు. శాసనసభ బిజినెస్ రూల్స్ 75 (1) ప్రకారం ముఖ్యమంత్రిపై, ఆయన మంత్రివర్గంపై తాను అవిశ్వాసం ప్రకటిస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అసెంబ్లీని సమావేశ పరిచి, తన నోటీసుపై తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ కార్యదర్శికి తాను ఇచ్చిననోటీసును బుధవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) కార్యాలయంలో విలేకరులకు విడుదల చేశారు.
సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని, కాంగ్రెస్ అధిష్టాన వర్గం విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడుగా ఈ నోటీసుకు తనంతట తానుగా సిద్ధపడినట్టు శంకర్రావు చెప్పారు. మంత్రిపదవినుంచి బర్తరఫ్ చేసి ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించారన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, ఎంఐఎం, బీజేపీ వంటి పార్టీల సభ్యులతో పాటు శాసన సభ్యులంతా తనకు మద్దతు ఇస్తారని విశ్వసిస్తున్నానని, మద్దతు కోసం ఎమ్మెల్యేలకు లేఖ రాస్తానని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును గవర్నర్‌కు కూడా పంపుతానన్నారు. అనంతరం నోటీసును ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌కు పంపారు.