రెంటికి చెడ్డ రేవడి కిరణ్!
రెంటికి చెడ్డ రేవడి కిరణ్!
Published Fri, Nov 15 2013 6:19 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైనట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీసుకున్న నిర్ణయం తిరుగుబాటు చేశానని సొంతంగా బిల్డప్ ఇచ్చుకున్న కిరణ్ కుమార్ రెడ్డిని సీమాంధ్ర ప్రాంత నాయకుల నుంచి సానుకూల స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ ఆ ప్రాంత నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోంటున్నారు. ఇక ఎలాగు అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కుడితిలో పడిన ఎలుక పరిస్థితిలా మారింది కిరణ్ వ్యవహారం.
సోనియా గాంధీతో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ సమావేశం కావడంతో పీఠం కదలుంతుందేమో అనే ఆందోళనకు కిరణ్ లోనయ్యారు. దాంతో తనకు అనుకూలంగా ఉన్న టెలివిజన్ చానెల్స్ లో కన్నాపై వ్యక్తిగతంగా దాడికి పూనుకున్నారు.
కాగా ముఖ్యమంత్రి పాల్గొన్నరచ్చబండ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి బాలరాజు హాజరుకాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. విశాఖపట్నంలో ఉన్న బాలరాజు చోడవరంలో జరిగిన రచ్చబండకు గైర్హాజరుకావడంతో సీఎం క్యాంపులో లుకలుకలున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. రచ్చబండ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేదని.. ఆ కార్యక్రమం గురించి వివరాలు అందలేదని బాలరాజు మాట్లాడటంతో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల మధ్య పెద్ద అగాథమే ఉన్నట్టు తెలుస్తోంది.
బాలరాజుకు ఆహ్వనం అందకపోవడంపై మరో మంత్రి కొండ్రు మురళీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.., ఈ ఘటనకు కారణమైన అధికారులపై చర్య తీసుకుంటామన్నారు. అయితే తాము బాలరాజుకు ముందుగానే సమాచారం అందించామని పై వాదనలకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలపడం మరింత గందరగోళానికి దారితీసింది. తన జిల్లాకే చెందిన గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇస్తూ, తనను పక్కన పెట్టడంతో మనస్తాపం చెందిన బాలరాజు సీఎం పర్యటనకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అవుదామనే ఆశతో విభజనకు వ్యతిరేకం అంటూ ఫోజు కొట్టిన కిరణ్ కు తెలంగాణ ప్రాంతంలోని ఇతర పార్టీల నేతల నుంచి కాకుండా స్వంత పార్టీ నేతలు, మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఊహించని పరిణామం. రచ్చబండ కార్యక్రమంతో మెదక్ జిల్లాలో పర్యటిద్దామని ప్రయత్నించిన కిరణ్ భంగపాటుకు గురైన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement