వంటశాలల్లో అవినీతి పంట
సాక్షి, కాకినాడ :
జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి ఉద్దేశించిన కిచెన్‌షెడ్ల (వంటశాలల) నిర్మాణం రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఇచ్చే సొమ్ములు సరిపోక నిర్మాణం మొక్కుబడి తంతుగా మారిందని, నిర్మాణంలో నాణ్యతను గాలికొదిలేసి, పెద్దఎత్తున నిధులు దారి మళ్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 4129 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఈ పాఠశాలల్లోని 4,24,373 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసే ఏజెన్సీల వారు వంటశాలలు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నానా అవస్థలు పడుతున్నారు. నాసిరకం భోజనం వడ్డించడంతో పాటు వాటిని తయారు చేసే పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తుండడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈపరిస్థితిని అధిగమించేందుకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రూ.75 వేలు, ఉన్నతపాఠశాల్లో రూ.1.50 లక్షల చొప్పున అంచనా వ్యయంతో కిచెన్‌షెడ్లు నిర్మించేందుకు 2012-13 విద్యా సంవత్సరంలో జిల్లాకు ప్రభుత్వం రూ.4.04 కోట్లు మంజూరు చేసింది. తొలిదశలో జిల్లాలో 1224 పాఠశాలల్లో ఈ షెడ్లు నిర్మించాలని తలపెట్టి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించారు. విద్యాశాఖాధికారుల ఒత్తిడి మేరకు తొలి దశలో అతికష్టమ్మీద 357 షెడ్ల నిర్మాణం పూర్తిచేసిన ఆ శాఖ అధికారులు నిధులు సరిపోవడం లేదనే సాకుతో చేతులెత్తేశారు. అయితే నిర్దేశించిన షెడ్లలో మూడో వంతు నిర్మాణం పూర్తి కాకుండానే మంజూరైన రూ.4.04 కోట్లలో రూ.3,77,33,000 పంచాయతీరాజ్‌శాఖకు విడుదల చేశారు. దీని వెనుక భారీ ఎత్తున అవినీతి జరిగిందని, నిర్మించిన షెడ్లలో చాలా వరకు నాణ్యతాలోపంతో ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను తుంగలోతొక్కి పాతపైపులు, రేకులతో తూతూ మంత్రంగా నిర్మించారని పలువురు ప్రధానోపాధ్యాయులే ఆరోపిస్తున్నారు.
అదనంగా ఇస్తేనే నాణ్యతట..
ఇక రె ండో దశలో ప్రభుత్వం 2013-14లో రూ.9.62 కోట్లు మంజూరు చేసింది. మొదటి దశలో నిర్దేశించిన లక్ష్యంతో 30 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేసిన పంచాయతీరాజ్ శాఖకే అడ్వాన్సు రూపంలో ఏకంగా రూ.2,88,66,000 విడుదల చేశారు. రెండో దశలో 382 ఉన్నతపాఠశాలల్లో షెడ్లు నిర్మించాలన్నది లక్ష్యం. అయితే ఒక్క పాఠశాలలోనూ కనీసం పునాదులు కూడా పడలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో కలెక్టర్ నీతూ ప్రసాద్ కిచెన్‌షెడ్ల నిర్మాణంలో జాప్యం, అవకతవకలపై సమీక్షించారు. లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేక పోతున్నారంటూ పంచాయతీరాజ్ అధికారులపై మండిపడ్డారు. అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని ప్రశ్నించారు. చేతకాకపోతే నిధులను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించడంతో ఇటీవలే రూ.2,02,02,000లను తిరిగి సర్వశిక్షాభియాన్ ఖాతాకు బదలాయించారురు. అయితే మిగిలిన రూ.86.64 లక్షల మొత్తాన్ని మొదటి దశ పనుల కోసం మినహాయించుకోవడం కిచెన్‌షెడ్ల నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే దానికి ఊతమిస్తోంది. పైగా నిర్దేశించిన రీతిలో కిచెన్‌షెడ్లు నిర్మించాలంటే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.50 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.లక్ష చొప్పున అదనంగా మంజూరు చేయాలని పంచాయతీరాజ్ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ‘మీకో దండం’ అంటూ వీటి నిర్మాణ బాధ్యతను ఇటీవలే స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించారు. కాగా కిచెన్‌షెడ్ల నిర్మాణంలో జాప్యం, అవినీతిలను దృష్టిలో ఉంచుకొని మొదటి దశలో చేపట్టిన నిర్మాణ పనులను తక్షణం నిలిపివేయాల్సిందిగా విద్యాశాఖ డెరైక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం కొసమెరుపు.