ప్రమాదమని తెలిసీ...
యలమంచిలి : ప్రమాదమని తెలిసినప్పటికీ తప్పనిస్థితిలో ప్రయాణాలు సాగిస్తున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. ఎక్కువ మంది ఆటోలు, ట్రాక్టర్లు, వ్యాన్‌లపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు కొందరు, రోజువారి కూలి పనులకు వెళ్లేందుకు మరికొందరు, కూలీలు, మహిళలు కిక్కిరిసిపోయి లగేజీ వాహనాలపై ప్రయాణిస్తున్నారు. అలాంటి సమయాల్లో ప్రమాదాలు జరిగితే తేరుకోలేని కష్టాన్ని, అంతకుమించిన నష్టాన్ని వారు ఎదురుకోవాల్సి వస్తోంది. యలమంచిలి ప్రాంతంలో ఇటీవల పలుచోట్ల ట్రాక్టర్లు, వ్యాన్‌లపై నిలబడి కాళ్లు కదిపే వీలులేకుండా కిక్కిరిసిపోయి గ్రామీణ ప్రాంత మహిళలు ప్రయాణిస్తున్నారు. తరచూ ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రయాణాలు సర్వసాధారణమైపోయాయి.
పరిమితికి మించి ఆటోల్లో సైతం ప్రయాణికులను ఎక్కించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. లగేజీ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోకూడదన్న నిబంధన అమలు కావడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కొన్ని సందర్భాల్లో భారీ రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రాణనష్టాలు సంభవించడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రయాణాలను నియంత్రించాల్సిన రోడ్డు రవాణా, పోలీసు శాఖాధికారులు, సిబ్బంది చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రమాదం జరిగినపుడు అధికారులు ప్రకటనలకు పరిమితమవుతున్నారు తప్ప చిత్తశుద్ధితో నిబంధనలు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించి ఇటువంటి ప్రయాణాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.