
సతీష్.. బెస్ట్ స్టూడెంట్
చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాదని నిరూపించాడీ యువకుడు. పరీక్షల సమయంలో ప్రమాదవశాత్తు తండ్రి చనిపోయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు.
కోదాడ: చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాదని నిరూపించాడీ యువకుడు. పరీక్షల సమయంలో ప్రమాదవశాత్తు తండ్రి చనిపోయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు. పీహెచ్‌డీలో ఫస్ట్ రావడమే కాదు...కర్ణాటక రాష్ట్ర ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన పేద యువకుడి విజయగాథ ఇది.
నల్లగొండ జిల్లా కోదాడలోని రావులపెంట వెంకయ్య, ఆదిలక్ష్మి దంపతులు నిరుపేద కూలీలు. వెంకయ్య స్వగ్రామం నల్లబండగూడెం. రాళ్లు కొట్టేపని చేస్తూ ఉపాధి కోసం కోదాడకు వలస వచ్చారు. తమ నలుగురు కుమారుల్లో చిన్నవాడైన సతీష్‌ను చదివించారు. చిన్నతనం నుంచే సతీష్ చదువులో చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో 557 మార్కులు సాధించడంతో కోదాడ క్రాంతి కళాశాల యాజమాన్యం ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించింది. 907 మార్కులు సాధించిన సతీష్‌కు మెడిసిన్‌లోనూ మంచి ర్యాంకే (3605) వచ్చింది.
మహబూబ్‌నగర్ హార్టికల్చర్ వర్సిటీలో బీఎస్సీ(హార్టికల్చర్)లో చేరాడు. విజయవంతంగా డిగ్రీ పూర్తిచేసి, వర్సిటీలో టాపర్‌గా నిలిచాడు. బీఎస్సీ పూర్తయ్యాక ఉద్యానవనశాఖలో ఉద్యోగం వచ్చింది. పెద్ద చదువుల కోసం వచ్చిన కొలువును వదులుకుని పీజీకి ప్రిపేర్ అయ్యాడు. జాతీయస్థాయిలో 136 ర్యాంకు సాధించాడు. బెంగళూర్ భాగల్‌కోట హార్టికల్చర్ వర్సిటీలో చేరి, 96శాతం మార్కులతో పీజీ పూర్తి చేశాడు.
పుట్టెడు దుఖంలోనూ....
ఉద్యానవనశాస్త్రంలో డాక్టరేట్ సాధించాలనే ఆశయంతో సతీష్ పీహెచ్‌డీ ప్రవేశపరీక్షకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఈ ఏడాది అక్టోబర్ మొదటివారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ తండ్రి వెంకయ్య మృతి చెందాడు. పుట్టెడు దు:ఖంలోనూ అక్టోబర్ చివరివారంలో జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. భాగల్‌కోట వర్సిటీస్థాయిలో పీహెచ్‌డీ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
సతీష్ అకడమిక్ కెరీర్‌ను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం 2013 సంవత్సరానికి ‘‘బెస్ట్‌స్టూడెంట్’’గా ఎంపిక చేసింది. ఈనెల 28న బెంగళూరులో జరిగే ఓ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా సతీష్ బెస్ట్‌స్టూడెంట్ అవార్డు, బంగారు పతకం అందుకోనున్నారు. కాగా, దీన్ని తన నాన్నకే అంకితమిస్తున్నానని సతీష్ పేర్కొన్నాడు.