కేంద్ర మంత్రి పాశ్వాన్‌తో చర్చిస్తున్న రాష్ట్ర మంత్రి కొడాలి నాని
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి ఏపీకి రావాల్సిన రూ. 4 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ కేంద్ర వినియోగదారుల, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు విన్నవించారు. మంగళవారం ఢిల్లీలో వారు మంత్రిని కలిశారు. అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీకి ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరాం. కేంద్రం 92 లక్షల కార్డులనే గుర్తించింది. మొత్తం కోటి 30 లక్షల కార్డులను గుర్తించాలని కోరాం.
ఎఫ్‌సీఐ గోడౌన్లలో ధాన్యం నిల్వలను ఖాళీ చేయాలని కోరాం. రైతుల నుంచి కొన్న బియ్యాన్ని భద్రపరిచేందుకు గిడ్డంగుల అవసరం ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తామని పాశ్వాన్ చెప్పారు’ అని వివరించారు. ‘రేషన్ కార్డుల జారీకి గత మార్గదర్శకాలను సడలించి మరింత ఎక్కువ మందికి కార్డులు వచ్చేలా నిబంధనలు సరళీకృతం చేశాం. ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్డులు ఇచ్చినందువల్ల వల్ల తమకు రేషన్ అవసరం లేదని స్వచ్ఛందంగా 9 లక్షల మంది కార్డులను వెనక్కి ఇచ్చేశారు’ అని చెప్పారు.
చంద్రబాబుకు శిక్ష తప్పదు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలకు శిక్ష తప్పదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబు ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రానికి మధ్య రాజ్యాంగ పరంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి వద్దని అసెంబ్లీ తీర్మానించిందని, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన శాసనమండలి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తప్పులు చేసి ఇప్పుడు ఢిల్లీకి వస్తే లాభం లేదని, కేంద్రం పెద్దలు కూడా వీరి మాట వినే అవకాశం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment