సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు కోన రఘుపతిని స్పీకర్ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఇతర శాసనసభ్యులంతా డిప్యూటి స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు రఘుపతి నామినేషన్‌ను 11మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా ప్రతిపాదించారు. కాగా, ‘కోన’ను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ముస్తఫా, అంబటి రాంబాబు, కరణం బలరామకృష్ణమూర్తి, అనగాని సత్యప్రసాద్, తదితరులు ప్రసంగించారు.
ప్రతిపక్షానికీ బాగా మాట్లాడే అవకాశమివ్వండి : జగన్
సభా నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ తరఫున బాపట్ల నుంచి రెండోసారి ఎన్నిక కావడం.. ఆయన కుటుంబ రాజకీయ చరిత్ర చూసి అందరికీ మంచి చేస్తారన్న ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు చెప్పారు. ’మీ తండ్రి కోన ప్రభాకరరావు స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా, మంత్రిగా, రాజకీయ ప్రముఖునిగా ఖ్యాతి గడించారు. మీరూ మంచి స్పీకర్‌గా రాణిస్తారని భావించి మిమ్మల్ని ఎన్నుకున్నాం. సభలో అందరికీ మంచి చేస్తారని, ప్రతిపక్షానికి కూడా బాగా మాట్లాడడానికి సమయం ఇస్తారని భావిస్తున్నాం. మీ నాన్నగారి మాదిరే అన్నింటా రాణించాలని ఆశిస్తున్నాం. మీరు ఎన్నికైనందుకు అభినందనలు’.. అని జగన్ అన్నారు.
మంచి పేరు తెచ్చుకోవాలి : చంద్రబాబు
అంతకుముందు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. కోన రఘుపతి తన తండ్రి బాటలో పయనించి సభకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కోన ప్రభాకరరావు నిర్మొహమాటంగా, విలువలతో కూడిన రాజకీయం చేసేవారని, జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు కలిగిన వ్యక్తని కొనియాడారు. తపన, సామాజిక బాధ్యత కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కోన రఘుపతి కూడా మంచి కీర్తి గడించాలన్నారు.
సభ్యుల ప్రయోజనాలు కాపాడుతా : కోన
కాగా, తనను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కోన రఘుపతి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శాసన నిర్మాణ వ్యవస్థలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు పరిచయం ఉందని, సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అర్థవంతమైన చర్చలతో నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగుదామన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై తక్షణమే వేటువేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదన్నారు. అంతటి స్ఫూర్తిదాయకమైన ప్రకటనతో సభా ఔన్నత్యాన్ని కాపాడతానని, తన తండ్రి పేరు, ప్రతిష్టలను కాపాడతానని, బాపట్ల ప్రాంత అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. అధికార పక్ష సభ్యుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గత సభలో డిప్యూటీ స్పీకర్ ఐదేళ్ల కాలంలో మహాఅయితే ఏ నాలుగైదు గంటలో ఆ స్థానంలో కూర్చుని విధులు నిర్వహించారని, ఈ సభలో ఆ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు.
తండ్రి స్పీకర్.. కొడుకు డిప్యూటీ స్పీకర్
బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి రెండుసార్లూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఈయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. కాగా, కోన ప్రభాకర్ అప్పట్లో స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం ఆయన తనయుడు రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment