
ముంపు బాధితులను ఆదుకోవాలి: కొణతాల
హైదరాబాద్: ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రులు రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయపునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. భారీవర్షాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ఇప్పటికే లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగిందని తెలిపారు.
భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో భారీ నష్టం జరిగిందన్నారు. కర్నూలు మార్కెట్లో భారీ స్థాయిలో పత్తి తడిసిపోయిందని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో వేరుశనగకు తీవ్రనష్టం జరిగినట్లు చెప్పారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో కూడా భారీ నష్టం జరిగిందన్నారు. రిజర్వాయర్ల వద్ద గట్లు తెగి తీవ్రనష్టం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేయవలసిన అవసరం ఉందన్నారు.
పార్టీ నేతలతో తమ నేత జగన్ మాట్లాడారని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.