విశాఖ ‘దేశం’లో.. కొణతాల కాక | Konathala Ramakrishna joins in TDP from Vizag | Sakshi
Sakshi News home page

విశాఖ ‘దేశం’లో.. కొణతాల కాక

Published Sat, Dec 27 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

విశాఖ ‘దేశం’లో.. కొణతాల కాక

విశాఖ ‘దేశం’లో.. కొణతాల కాక

మాజీ మంత్రి రామకృష్ణ చేరికపై మంత్రులు గంటా, అయ్యన్న ఏకాభిప్రాయం
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరేందుకు మార్గం సుగమమైందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆయన  చేరికను మొదట వ్యతిరేకించిన మంత్రి గంటా శ్రీనివాసరావు చివరకు మొత్తబడ్డారు. విశాఖపట్నం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉండే మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా ఇద్దరూ కొణతాల చేరికపై ఏకాభిప్రాయానికి వచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
 
 శుక్రవారం సచివాలయంలో అయ్యన్నపాత్రుడి చాంబర్‌లో కొణతాలతో గంటా టీడీపీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరితో కలసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేరికపై గంటకు పైగా చర్చలు జరిపారని పార్టీ వర్గాలు తెలిపాయి.  కొణతాల చేరికను వ్యతిరేకిస్తూ  పలు నియోజకవర్గాల్లో కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు ధర్నాలు కూడా చేపడుతున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తమను దెబ్బతీసేందుకు ఈ ఎత్తుగడ వేశారని గంటా వర్గం భావించింది. దీనికి ప్రతిగా వారు  మొదట నుంచి అయ్యన్నపాత్రుడుకు ప్రత్యర్ధిగా ఉండే దాడి వీరభద్రరావును తిరిగి పార్టీలోకి చేర్చే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.ఈ ఎత్తుగడలతో పక్షం రోజుల నుంచి జిల్లా టీడీపీ రాజకీయాల్లో విభేదాలు రగులుతున్నాయి. కాగా కొణతాల చేరికకు అధినేత చంద్రబాబు సుముఖంగా ఉండడంతో ఇప్పుడు గంటా వర్గం తప్పనిస్థితిలో అంగీకారం తెలపిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో పక్క దాడి  తిరిగి పార్టీలో చేరికపై కూడా బాబు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది.  
 
అంతా అధినేత ఇష్టం: అయ్యన్న
 పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అధినేత ఇష్టమని, చిన్న చిన్న తేడాలు ఉన్నా సమన్వయం చే సుకుని పనిచేసుకోవడానికి కార్యకర్తలుగా తామెప్పుడూ సిద్ధమేనని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దాడి వీరభద్రరావు పార్టీలోకి వచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు.
 
 చర్చే రాలేదు: గంటా
 మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడితో జరిగిన భేటీలో రాజకీయ అంశాలుగానీ, కొణతాల చర్చగానీ రాలేదన్నారు. ఇతర పార్టీల నేతలందరూ సీఎం నాయకత్వం పట్ల మొగ్గు చూపుతున్నారని అన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఎవరు చేరుతున్నా సానుకూలంగా స్పందించడం తప్పుకాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement