కిరణ్పై కొండ్రు తిరుగు బావుటా!
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి కొండ్రు మురళి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నిన్న మొన్నటి వరకూ క్రమశిక్షణ గల కార్యకర్త అంటూ కిరణ్ను సమర్థించిన కొండ్రు హఠాత్తుగా స్వరం మార్చి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కొత్తపార్టీ పెడితే ప్రజలే ఛీ కొడతారని అన్నారు. ఇచ్చిన పదవిని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని కొండ్రు మండిపడ్డారు.. అవినీతిపురులకు పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టారని కొండ్రు తెలిపారు. బొత్స నివాసంలో సాయంత్రం జరిగే సమావేశంలో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కాగా ఈ రోజు ఉదయం బొత్స సత్యనారాయణతో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీకి మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేష్, బాలరాజు, కొండ్రు మురళి తదితరులు ఉన్నారు. మరోవైపు మంత్రి మహీధర్ రెడ్డి ....ముఖ్యమంత్రి కిరణ్ను కలిశారు.