కాలగర్భంలో కలసిపోయేదే !
కిరణ్ పార్టీపై పీసీసీ చీఫ్ బొత్స వ్యాఖ్య
విభజన నిర్ణయం తీసుకున్నపుడు కిరణ్
రాజీనామా ఎందుకు చేయలేదు?
గవర్నర్‌పై విమర్శలు సరికాదు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తగా పెట్టనున్న పార్టీ కాలగర్భంలో కలిసిపోయేదే తప్ప నిలిచేది కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతిందని చెబుతున్న కిరణ్ విభజన నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. పదవిలో చివరి వరకు కొనసాగి.. ఇప్పుడు కొత్తపార్టీ అంటూ వెళ్లినంత మాత్రాన ప్రజలు ఆదరిస్తారనుకోవడం పొరపాటన్నారు. గురువారం గాంధీభవన్లో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కిరణ్ ఆత్మగౌరవానికి ఏమైంది? ఆయ నకు ఇప్పుడు విభజన గుర్తుకు వచ్చిందా?’’ అంటూ ప్రశ్నించారు.
గవర్నర్‌పై కిరణ్ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పట్ల జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. కిరణ్‌ను నమ్మితే నట్టేట మునిగినట్లేనని, ఆ విషయం ఇప్పటికే ఆయన వెనక చేరిన వారికి అర్థమైందన్నారు. కిరణ్‌పై అవినీతి ఆరోపణల గురించి మీడియా ప్రస్తావించగా.. ‘‘ప్రజాజీవితంలో ఉన్న వారిపై ఆరోపణలు వస్తే విచారణకు సిద్ధపడాలి. కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోకూడదు’’ అన్నారు. కిరణ్‌పై మాజీ మంత్రి డొక్కా చేసిన ఆరోపణల్ని ప్రస్తావించగా.. ‘‘ఆయన వద్ద ఏం సమాచారం ఉందో నాకెలా తెలుస్తుంది’’ అని ఎదురు ప్రశ్నించారు.
సవాలక్షలో కిరణ్ పార్టీ ఒకటి: జానారెడ్డి
కిరణ్ పెట్టే పార్టీ ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని, దేశంలో అనేక రిజిస్టర్డ్ పార్టీల్లో అదీ ఒకటని మాజీ మంత్రి కె .జానారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్‌పై కిరణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ విమర్శలపై గవర్నర్‌ను అడిగితే ఆయనే సమాధానం చెబుతారన్నారు. బ్లాక్ స్థాయి కూడా లేని కిరణ్‌ను సీఎంగా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మరో మాజీ మంత్రి దానం నాగేందర్ విమర్శించారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగతమని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చని విప్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే ఎన్నికల్లో అదెలాంటి ప్రభావం చూపిస్తుందనేదే ప్రధానమన్నారు. తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం ఉంటుందో ఉండదో చెప్పలేమన్నారు.
బాబువి పగటి కలలు: పద్మరాజు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులపై విశ్వాసం లేకనే కాంగ్రెస్ పార్టీనుంచి వచ్చిన వారిని టీడీపీలోకి రప్పించుకుంటున్నారని చీఫ్‌విప్ రుద్రరాజు పద్మరాజు విమర్శించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వారిని చేర్చుకున్నంత మాత్రాన టీడీపీ గెలుస్తుందనుకోవడం పొరపాటని, సీఎం అవుతానంటున్న చంద్రబాబువి పగటికలలేనని దుయ్యబట్టారు.