మా భూములు మాకిచ్చేయండయ్యా | Kothapalli Farmers Protest Against Kakinada SEZ | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 1 2018 6:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Kothapalli Farmers Protest Against Kakinada SEZ - Sakshi

పోలీసు కాళ్లు పట్టుకొని వేడుకుంటున్న సెజ్‌ రైతు

సాక్షి, కొత్తపల్లి : ‘అయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటాం.. మా భూములు మాకిచ్చేయండి’.. అంటూ రైతులు పోలీసుల కాళ్ల మీద పడ్డా ఖాకీల హృదయం కరగలేదు.. బాధిత రైతులతో పాటు వారికి మద్దతుగా వచ్చిన వివిధ పార్టీల నేతల్ని అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. రైతుల పోరాటాన్ని అణచి వేయడానికి ప్రభుత్వం భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దించి ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సెజ్‌ బాధిత రైతులు వారం కిందట సమావేశమై సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు చింతా సూర్యనారాయణమూర్తి పొలంలో నాట్లు వేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆదివారం సూర్యనారాయణమూర్తితో కలిసి మూలపేట నుంచి కొత్తమూలపేటకు బయలుదేరారు. సెజ్‌ ప్రాంతాల్లో అప్పటికే మోహరించిన సుమారు 500 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు వారిని అడ్డుకున్నాయి.

అలాగే పొన్నాడ శివారు రావివారుపోడు, రమణక్కపేటకు చెందిన సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు బావిశెట్టి నారాయణస్వామి, పెనుమల్లు సుబ్బిరెడ్డి తదితరులతో పాటు సీపీఎం రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవీ నరసింహం, సీపీఎం జిల్లా కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస్, సీపీఎం నేత కూరాకుల సింహాచలం, వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్ట్‌ చేసి అన్నవరం, పిఠాపురం, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. ఈ సందర్భంగా తమ భూములు తమకిచ్చేయాలంటూ ఓ రైతు పోలీసు కాళ్లపై పడ్డాడు. 1983 భూసేకరణ చట్ట ప్రకారం కాకుండా.. 2013 భూసేకరణ చట్టం ప్రకారమైనా తమకు పరిహారం ఇవ్వాలని వారు వేడుకున్నారు. అనంతరం మొత్తం 147 మందిని పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సెజ్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్‌ 30 అమల్లో ఉన్నందున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు. 


రైతులకు మద్దతిచ్చిన వైఎస్సార్‌సీపీ నేత దొరబాబును అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ అండ 
సెజ్‌ రైతులకు మద్దతు తెలిపేందుకు పిఠాపురం నుంచి వస్తున్న వైఎస్సార్‌సీపీ పిఠాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, వైఎస్సార్‌ సీపీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్‌తో పాటు పలువురిని నాగులాపల్లిలో అరెస్ట్‌ చేసి తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ తమ భూముల కోసం పోరాడుతున్న రైతులను అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా రైతులు, వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్‌లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఖండించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement