అసెంబ్లీ ఆవరణలో ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న భట్టి, జగ్గారెడ్డి, సీతక్క
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment