కార్యాచరణ చూపించు బాబూ
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి డిమాండ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :సరిగ్గా రెండు వారాల వ్యధిలో మూడుసార్లు పశ్చిమ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇప్పటికి వర కు జిల్లాకు ఏ మేలు చేశారో ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా పశ్చిమ రుణం తీర్చుకోలేనిదంటూ వల్లె వేసే చంద్రబాబు ఇంతవరకు జిల్లా ప్రగతికి సంబంధించి కార్యాచరణే ప్రకటించలేదని ఆయన పేర్కొన్నారు. గురువారం కొత్తపల్లి తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. చీటికీమాటికీ చంద్రబాబు జిల్లాలో పర్యటించడం వల్ల రూ.కోట్ల మొత్తంలో సర్కారు సొమ్ము వృథా కావడం, అధికారులకు ఒత్తిళ్లు తప్ప ప్రయోజనమేమిటని ప్రశ్నించారు.
గోదావరి డెల్టా చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రైతు ప్రస్తుత రబీ సీజన్‌లో తీవ్రమైన సాగునీటి సంక్షోభం ఎదుర్కొంటున్నాడని కొత్తపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఖరీఫ్ మిగిల్చిన నష్టంతో చేతిలో చిల్లిగవ్వ లేక రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే బెజవాడ కాల్‌మనీ మకిలిని సాధారణ వడ్డీ వ్యాపారులకు కూడా అంటించడంతో రైతులకు ఎవ్వరూ రుణాలు ఇవ్వడం లేదని, సర్కారు రుణమాఫీ గారడీ దెబ్బకు బ్యాంకులూ రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు.
ఈ పరిస్థితుల్లోనైనా చంద్రబాబు కనీస ధర్మంగా స్పందించాలని కొత్తపల్లి కోరారు. గత ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది ఖరీఫ్ అంచనా నష్టం రూ.87కోట్లతో పాటు గత మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు నష్టపోయిన రైతాంగానికి రావాల్సిన రూ.137 కోట్ల పరిహారాన్ని కూడా వెంటనే రైతులకు అందజేయాలని కోరారు. అదనపు జలాల కోసం ఒడిశాను త్వరగా ఒప్పించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. లేదంటే రబీ పంటను ఎండగట్టిన పాపం పాలకులదేనన్నారు.
పర్యటనలతో రుణం తీరిపోతుందా?
Published Fri, Jan 8 2016 12:33 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement