అగ్నిప్రమాదాలపై చంద్రబాబు సర్కారు నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం
మదనపల్లిలో ఎలాంటి పత్రాలు దగ్థం కాలేదన్న అధికారులు
తిరుపతిలో కాలినవి చిత్తు కాగితాలేనని నిర్ధారణ
ధవళేశ్వరంలోనూ చిత్తు కాగితాలనే కాల్చారన్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య
అయినాసరే సీఎం చంద్రబాబు పదేపదే దుష్ప్రచారం
వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా సర్కారు కుతంత్రం
సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించే పన్నాగం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి రాయచోటి: కళేబరం కనిపిస్తే చాలు రాబందులు వాలిపోయినట్లుగా.. రాష్ట్రంలో ఎక్కడైనా చిత్తు కాగితాలు కాలితే చాలు టీడీపీ కూటమి పెద్దలు అక్కడ వాలిపోతున్నారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏవో అక్రమాలు జరిగిపోయాయంటూ నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు.
సాక్షాత్తూ సీఎం చంద్రబాబే ఈ రాజకీయ హైడ్రామాకు నేతృత్వం వహిస్తుండగా.. ఆయన మంత్రివర్గ సహచరులు, టీడీపీ కూటమి నేతలు ఆయనకు తందానా అంటున్నారు. టీడీపీ సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారన్నది తేటతెల్లమవుతోంది. మదనపల్లి, తిరుపతి, లేదా ధవళేశ్వరం.. ఇటీవల ఇక్కడ చోటుచేసుకున్న ఏ అగ్నిప్రమాదాన్ని చూసినా కూటమి నాటకాలు బయటపడుతున్నాయి.
మదనపల్లిలో కొండను తవ్వి తుస్సుమన్నారు..
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై కొండను తవ్వినంత పనిచేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలుకను కూడా పట్టుకోలేకపోయింది. షార్ట్ సర్క్యూట్‌వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసు అధికారులు, నిఘా వర్గాలు ఆ రోజు ఉదయాన్నే తనకు చెప్పినట్లు సీఎం చంద్రబాబే వెల్లడించారు. కానీ, ఆ ఉదంతాన్ని అవకాశంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వేధించాలని ఆయన భావించారన్నది స్పష్టమైంది.
అందుకే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను మదనపల్లికి హుటాహుటిన పంపారు. ఇద్దరు ఆర్డీఓ స్థాయి అధికారులను అరెస్టుచేయడంతోపాటు సీఐడీ విచారణకు ఆదేశించారు. కానీ, టీడీపీ ప్రభుత్వ కుట్రలపై తీవ్రంగా స్పందించిన ఎంపీ మిథున్‌రెడ్డి.. ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసరడంతో అంతవరకు హడావుడి చేసిన ప్రభుత్వం తోకముడిచింది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతుందో..
ప్రశ్న–1: తహశీల్దార్ కార్యాలయం నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయానికి.. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ఫైళ్ల ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉండే ఫైళ్లన్నీ కూడా ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఉంటాయి. మరి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దగ్థంచేస్తే ఆధారాలు నాశనం చెయ్యొచ్చని ఆర్డీఓ స్థాయి అధికారులు ఎందుకు భావిస్తారు? అంటే ఆ ఆరోపణలన్నీ నిరాధారమే కదా!?
ప్రశ్న–2: రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మొత్తం 2,440 ఫైళ్లున్నాయి. అగ్నిప్రమాదాన్ని గుర్తించగానే 740 ఫైళ్లు దగ్థం కాకుండా నివారించారు. మిగిలిన 1,700 ఫైళ్లలో ఇప్పటికే 90 శాతం ఫైళ్లను పునరుద్ధరించారు. మిగిలిన వాటిని కూడా రిట్రీవ్ చేస్తారు. ఇలా ఫైళ్లన్నీ భద్రంగా ఉంటే ఇక అందులో కుట్ర కోణం ఎక్కడుంది!?
తిరుపతిలో విజిలెన్స్ చేతులెత్తేయడంతోనే..
ఫైళ్లు, కీలకపత్రాలు కాల్చేశారంటూ టీడీపీ కూటమి నేతలు తమ రెండో డ్రామాకు తిరుపతిని వేదికగా చేసుకున్నారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ విభాగంలో ఈనెల 17 సాయంత్రం సంభవించిన చిన్న అగ్నిప్రమాదానికి రాజకీయ రంగు పులిమారు. కానీ, కేవలం చిత్తు కాగితాలే కాలిపోయాయని.. అంతకుమించి ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
మరి టీడీపీ కూటమి నేతలు ఎందుకు రాద్ధాంతం చేశారంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. 72మంది అధికారులు, ఇతర సిబ్బందిని విచారించినా ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయింది. దీన్ని కప్పిపుచ్చేందుకే ఫైళ్ల దగ్థం నాటకం.
ధవళేశ్వరంలోనూ చిత్తు కాగితాల చెత్త రాజకీయం..
మదనపల్లి, తిరుపతి తర్వాత టీడీపీ కూటమి పెద్దల హైడ్రామా సీను తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి మారింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో జిరాక్స్ కాగితాలు, చిత్తు కాగితాలను అక్కడి సిబ్బంది ఉన్నతాధికారుల అనుమతితోనే కాల్చివేశారు. వీటిల్లో విలువైన పత్రాలు ఏమీలేవని సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. కానీ, మంత్రి కందుల దుర్గేశ్ మాత్రం అత్యుత్సాహంతో దీనికి రాజకీయ రంగు పులిమారు.
భూ నిర్వాసితులకు పరిహారంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారంటూ నోటికొల్చినట్లు నిరాధార ఆరోపణలు చేశారు. నిజానికి.. కాల్చినవన్నీ చిత్తు కాగితాలేనని జిల్లా అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పుడీ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం కిక్కురుమనడంలేదు. ఘటన జరిగిన రెండ్రోజుల తరువాత కూడా అధికారులు ఏమీ చెప్పడం లేదంటే అన్నీ భద్రంగా ఉన్నట్లే కదా.
ఫ్రీ హోల్డ్ భూముల ఆరోపణల్లోనూ బోల్తా..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం జిల్లాలో ఏకంగా రెండువేల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల కుంభకోణానికి పాల్పడ్డారని టీడీపీ కూటమి నేతలు తెగ దు్రష్పచారం చేశారు. తాజాగా.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆ ప్రాంతంలో పర్యటించి కేవలం 138 ఎకరాలే ఫ్రీహోల్డ్ కింద నమోదయ్యాయని తెలిపారు. 20ఏళ్లు దాటిన అసైన్డ్ భూములను కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని కూడా ఆయన తేల్చిపారేశారు.
అంటే.. ఎన్నికల ముందు టీడీపీ కూటమి నేతలు రాజకీయ కుట్రతోనే దు్రష్పచారం చేశారన్నది తేలిపోయింది. ఇలా.. ఈ ఉదంతాలన్నింటి వెనుక ఎలాంటి కుట్రలేదని ప్రాథమిక విచారణలో నిగ్గు తేలినప్పటికీ చంద్రబాబు మాత్రం పక్కా కుట్రతో.. తన సహజ లక్షణంతో పదేపదే తప్పుడు అరోపణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment