‘పోలవరం’పై రాజీ పడం
నరసాపురం అర్బన్: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీలేని పోరాటం చేస్తానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. మంగళవారం కొత్తపల్లి హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాలో రైతుల పరిస్థితి, సాగునీటి సమస్య, ఇసుక కొరత, వేసవిలో జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై చర్చించినట్టు కొత్తపల్లి విలేకరులకు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా పోలవరం ప్రాజెక్ట్‌కు న్యాయం చేయకపోవడం, ముఖ్యమంత్రి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడం వంటి అంశాలను కూలంకషంగా చర్చించినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్మాణాత్మక పోరాటం చేద్దామని, ప్రభుత్వాల మెడలు వంచి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే విధంగా పోరాడదామని అధినేత సూచించినట్టు చెప్పారు.
వైఎస్ జగన్‌కు కలిసిన ముదునూరి
ఆచంట : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అరకొర నిధుల కేటాయింపుపై జిల్లా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం వైఎస్ జగన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అరకొర నిధులు కేటాయించడంపై అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ చెప్పారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించినట్టు ప్రసాదరాజు తెలిపారు.
అధినేత దృష్టికి మెట్ట సమస్యలు
దేవరపల్లి: జిల్లాలో మెట్ట రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వివరించినట్టు వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గం కన్వీనర్ తలారి వెంకట్రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలిసినట్టు ఆయన చెప్పారు. పొగాకు, ఆయిల్‌పామ్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధర, భీమోలులో రైతులకు పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో దౌర్జన్యంగా జరుపుతున్న చింతలపూడి కాలువ పనులు, దూబచర్ల పరిసర గ్రామాల్లో దళితుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్న తీరును వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి వివరించినట్టు తలారి చెప్పారు.