'వైఎస్ జగన్ అంటే భయమెందుకు?'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టీడీపీ నేతలకు భయమెందుకని ఆ పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బరాయుడు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేతలు తెలంగాణ ఏసీబీకి పట్టుపడ్డారని, ఈ కేసులో వైఎస్ జగన్కు సంబంధమేంటని నిలదీశారు. గురువారం హైదరాబాద్ లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో కలసి మీడియాతో్ మాట్లాడారు.
టీడీపీ తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలని, తప్పు చేయకుంటే చేయలేదని నిరూపించుకోవాలని కొత్తపల్లి సుబ్బరాయుడు సూచించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి, తెలుగు ప్రజల పరువు తీసిన టీడీపీ నాయకుల వైఖరిని తప్పుపట్టినందుకు వైఎస్ జగన్ దిష్టిబొమ్మలను టీడీపీ నేతలు దగ్ధం చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మీ తప్పులను కప్పిపుంచుకోవడానికి ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. ఏపీ సర్కార్ మొత్తం ఓటుకు కోట్లు కేసు చుట్టూ తిరుగుతోందని, రైతు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు.
చంద్రబాబు ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సీపీ నేత, మాజ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. రాయలసీమ, కృష్ణా డెల్టా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు విస్మరిస్తున్నారని ఆరోపించారు. తన కేసు కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పాలమూరు ప్రాజెక్టుపై మాత్రం తన వైఖరి చెప్పడం లేదని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు.