సాక్షి, అమరావతి: ఈనెల 23 న జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు రాష్ట్రంలో వేడి రగిలించాయి. బలం లేకపోయినా స్వతంత్ర అభ్యర్థి పేరుతో మూడో అభ్యర్థిని బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ముఖ్యనేత’ ఆదేశాల మేరకు అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు రంగంలోకి దిగి విపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేస్తున్నారని తెలుస్తోంది. డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎరవేస్తూ.. నీతిబాహ్యమైన రీతిలో ఎమ్మెల్యే ఓట్లను కొనుగోలు చేసేందుకు దిగజారారని సమాచారం. మరోవైపు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం నాయకులు ఇపుడు కూడా అదే తరహాలో సాక్ష్యాలతో సహా దొరికిపోయారని వార్తలు వినిపిస్తుండడం సంచలనంగా మారింది. రేవంత్ తరహాలో ఏపీలో దొరికిన టీడీపీ పెద్దలు ఎవరు?.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో వారు ఏం మాట్లాడారు? ముఖ్యనేత పేరు కూడా ప్రస్తావించారా..? ‘ముఖ్యనేత’ చెబితేనే మీతో ఈ మాట మాట్లాడుతున్నామంటూ బేరమాడారా..? త్వరలోనే ఆ ఆడియో వీడియో టేపులు బయటకు రానున్నాయా... అన్నవి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.
ముఖ్యనేత తెర వెనుక వ్యవహారం!
రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడో సీటు కోసం ‘ముఖ్యనేత’ తెరవెనుక నడుపుతున్న వ్యవహారం ఇప్పడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలను ఎంతకైనా కొనుగోలు చేయాలని ‘ముఖ్యనేత’ సంప్రదింపులు జరిపించారని వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన రాయ‘బేరాల’ సాక్ష్యాలు ప్రతిపక్షపార్టీకి చెందిన సీనియర్ నాయకులకు చేరాయన్న విషయం టీడీపీలో కలకలం సృష్టిస్తోంది. ఇలా ప్రలోభాలకు దిగిన నాయకులు మాట్లాడిన మాటలను ఆడియో వీడియో టేపులలో ఎమ్మెల్యేలు రికార్డు చేసినట్లు సమాచారం. ఈ సాక్ష్యాలను సరైన సమయంలో బయట పెడతామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ప్రకటించడం తెలుగుదేశం వర్గాల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దోషిగా నిండా మునిగిపోయారని, తత్ఫలితంగా అక్కడ పార్టీనే బలిపెట్టాల్సి వచ్చిందని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు.
బలాబలాలను బట్టి టీడీపీకి 2, వైఎస్సార్సీపీకి 1
ప్రస్తుతం శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీతో పాటు మిత్రపక్షమైన బీజేపీ సభ్యులతో కలిపి తెలుగుదేశానికి కేవలం రెండు సీట్లకు సరిపడా బలం మాత్రమే ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి ఉన్న 44 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అనుసరించి ఒకస్థానం వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారిలో నలుగురిని తన కేబినెట్లోనూ చోటు కల్పించడం తెలిసిందే. సోమవారంతో నామినేషన్లకు తుది గడువు కాగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున వేమిరెడ్డిప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెండింటికే నామినేషన్లు వేస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే కనుక ఎన్నిక అనివార్యమవుతుంది. అప్పుడు అసెంబ్లీలోని సభ్యుల మొత్తం సంఖ్యను అనుసరించి మొదటి ప్రాధాన్యత ఓటు కింద 44 మంది ఓట్లు దక్కించుకున్న వారు విజయం సాధించినట్లే.
ఫిరాయింపు ఎమ్మెల్యేలలో అంతర్మథనం..
చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఆయనతో పాటు మంత్రులు చేసిన అనేక అవినీతి వ్యవహారాలు, తమ సొంతమనుషులకోసం చేసిన అక్రమాలతో పాటు ప్రజావ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి టీడీపీలో చేర్చుకున్న అనేకమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. ప్రలోభాల వల్ల టీడీపీలోకి వెళ్లిన తమను ఆ సమయంలో వాడుకొని తరువాత నుంచి కరివేపాకుల్లా పక్కన పెట్టారని అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ప్రలోభాల వల
విపక్ష ఎమ్మెల్యేలపై ప్రయోగించిన ప్రలోభాలు రకరకాలుగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేని కలుసుకున్న నాయకుడు ఏకంగా మంత్రి పదవి ఆఫర్ చేయగా.. మరో ఎమ్మెల్యే వద్దకు తెల్లవారుఝామున ఎవరి కంటా పడకుండా వచ్చి రకరకాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారట. మనం ఇద్దరిదీ ఒకటే కులం.. నువ్వు అధికారపార్టీకి మద్దతిస్తే మనకు చాలా మేలు జరుగుతుంది అని మరో ఎమ్మెల్యేని ఒప్పించే ప్రయత్నం చేశారు.. మన ఇద్దరిదీ బాల్య స్నేహం.. నీకు రూ.30 కోట్ల వరకు ఇప్పిస్తాను అని మరో నాయకుడు ఒక ఎమ్మెల్యేకు ఆఫర్ చేశారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment