
కోవూరు: కోవూరు సర్పంచ్ కూట్ల ఉమను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో ఎస్టీగా తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందింది. అయితే పాలకవర్గం ఉమ ఎస్టీ కాదని తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించిందని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు విచారణ జరిపించి ఉమ ఎస్టీ కాదని ధ్రువీకరించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోవూరు తహసీల్దార్‌ను ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శీలం రామలింగేశ్వరరావు కూట్ల ఉమపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కూట్ల ఉమపై కేసు నమోదు చేయకపోవడంపై సాక్షి దినపత్రికలో వార్త రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోవూరు అడిషనల్ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ పెద ఖాసిమ్ ఉమకు మార్చి ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు.