రాష్ర్టం కలిసి ఉంటే బాగుండేది
ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉంటే ఎంతో బాగుండేదని ప్రముఖ సినీనటుడు కృష్ణభగవాన్ అన్నారు. పట్టణంలో స్వీట్‌హోం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక డైలాగ్ చెప్పాలని అభిమానులు కోరగా, వెంకీ సినిమాలో గుర్తింపు పొందిన ‘జీఎం గావాల్నా...ఎజీఎం గావాల్నా...బంకు గావాల్నా... జింకు గావాల్నా’ డైలాగ్ చెప్పి అందరినీ న వ్వించారు. అనంతరం ‘సాక్షి’ విలేకరితో కాసేపు ముచ్చటించారు.
ప్రస్తుతం సినీపరిశ్రమ పరిస్థితి ఏంటి?
కృష్ణభగవాన్: ప్రస్తుతం సినీపరిశ్రమ పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణా ప్రాంతంలోనూ, సీమాంధ్ర ప్రాంతంలోనూ చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందాల్సి ఉంది.
జాన్ అప్పారావు సినిమాలో హీరోగా మెప్పించారు కదా? మళ్లీ హీరోగా ఏదైనా సినిమా చేయాలనుకుంటున్నారా?
కృష్ణభగవాన్: అప్పుడలా కలిసొచ్చేసింది (అంటూ తన బాణీలో నవ్వుతూ టైమింగ్ డైలాగ్ వదిలారు.) అప్పారావు ప్రేక్షకులను నవ్వించాడు...ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి ప్రస్తుతం హీరో ఆలోచన లేదు.
మీరు చేస్తున్న కొత్త సినిమాల సంగతేంటి?
కృష్ణభగవాన్: కొత్త హీరోల చిత్రాల్లో చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్టులు చేయాల్సి ఉంది.
చిత్ర పరిశ్రమలో మీ స్థానమేంటి?
కృష్ణభగవాన్: ప్రస్తుతం ఎందరో హాస్యనటులు సినిమాల్లోకి కొత్తగా వస్తున్నప్పటికి నాకు మాత్రం సరైన పాత్రలు లభిస్తున్నాయి. సినీపరిశ్రమలో అడుగు పెట్టినప్పటినుంచి హాస్యన టుడిగానే ఉన్నాను ఎప్పటికి అలాగే చిరస్థాయిగా నిలిచిపోవాలని నా కోరిక.