‘కృష్ణా’లో యువజనోత్సవాలు | 'Krishna' festivals | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’లో యువజనోత్సవాలు

Published Wed, Nov 12 2014 8:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

‘కృష్ణా’లో యువజనోత్సవాలు

‘కృష్ణా’లో యువజనోత్సవాలు

చిలకలపూడి (మచిలీపట్నం) : విద్యార్థుల్లో ఉత్తేజాన్ని పెంచేందుకు ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు కృష్ణా తరంగ్-2014 పేరుతో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ వున్నం వెంకయ్య తెలిపారు. వర్శిటీలోని చాంబర్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ఆడిటోరియంలో యువజనోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాల్గొంటారని చెప్పారు. మూడు రోజుల పాటు మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్లు, థియేటర్, ఫైన్ ఆర్ట్స్, ఇన్‌స్టాలేషన్ రంగాల్లో మొత్తం 26 అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. వెయ్యిమందికి పైగా విద్యార్థులు 20 కళాశాలల నుంచి వస్తారని ఆయన పేర్కొన్నారు. అన్ని అంశాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తామని, అన్ని అంశాలు కలిపి 216 బహుమతులు ఉంటాయని వివరించారు. యువజనోత్సవాల్లో పాల్గొని మొదటి బహుమతులు సాధించిన విద్యార్థులు డిసెంబరు 8వ తేదీన కర్ణాటకలోని తుంపూర్‌లో జరగనున్న సౌత్ జోన్ కాంపిటేషన్ పాల్గొంటారన్నారు.

ఈ నెల 15 సాయంత్రం 5 గంటలకు పోటీల ముగింపు కార్యక్రమం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి  అధ్యక్షుడు ఎల్.వేణుగోపాలరెడ్డి ముఖ్య అతిథిగా, నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.వియన్నారావు విశిష్ట అతిథిగా, కృష్ణా విశ్వవిద్యాలయం సైన్స్ ఫ్యాకల్టీ ఎంవీ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ వైకే సుందరకృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. యువజనోత్సవాల్లో పాల్గొనే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లిస్తామని, బందరులో మూడు రోజుల పాటు భోజన, వసతి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 కమిటీలు నియమించినట్లు వీసీ తెలిపారు.
 
ఫిబ్రవరిలో కొత్త భవన నిర్మాణం

ఫిబ్రవరిలో కృష్ణా విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెంకయ్య తెలిపారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు కృష్ణా విశ్వవిద్యాలయం తరఫున నిధులు చెల్లించటం జరిగిందన్నారు. రూ.70 కోట్లు పైబడి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండటంతో సీపీ  డబ్ల్యూడీ ఢిల్లీలోని కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు ఆరువారాల సమయం పడుతుందన్నారు. ఢిల్లీలోని కార్యాలయంలో వర్క్స్ బోర్డ్ సమావేశంలో అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వీసీ వెంకయ్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, వైకే సుందరకృష్ణ, పీఆర్వో వినయ్‌కుమార్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement