‘కృష్ణా’లో ముంచేశారు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టు ముందు బుధవారం మరోమారు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమ వాదన వినిపించనున్నాయి. వాస్తవ అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎగువ రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుని, దిగువ రాష్ట్రాల పొట్టకొట్టిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నాయి. ముఖ్యంగా మిగులు జలా లు లేవన్న రాష్ట్ర వాదనకు భిన్నంగా ట్రిబ్యునల్ తీర్పును వె లువరించిన తీరు, నీటి లభ్యతను 75 శాతం నుంచి 65 శాతానికి కుదించిన అంశాన్ని సుప్రీం ముందు వాదనలకు పెట్టాలని నిర్ణయించాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ 5(2) కింద ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో ఉమ్మడి ఏపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీం.. ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదని కేంద్రాన్ని ఆదేశించింది. దానిపై స్పందించిన కర్ణాటక, మహారాష్ట్ర బ్రిజేష్ తీర్పు, తుది తీర్పును కలిపి గెజిట్ ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీంలో పిటిషన్లు వేశాయి. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణను సైతం ఈ విచారణలో చేర్చేందుకు అంగీకరించిన సుప్రీం.. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేం దుకు అనుమతినిచ్చింది. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వాదనలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సూచించగా, అన్ని రాష్ట్రాలు అఫిడవిట్లను సమర్పించాయి. ఈ నేపథ్యంలో బుధవారం దీనిపై మరోసారి విచారణ జరుగనుంది. ఇందుకోసం ఇరు రాష్ట్రాల ముఖ్య అధికారులు ఢిల్లీ వెళ్లారు.
తిరిగి కేటాయించాల్సిందే
బ్రిజేష్ తీర్పును పూర్తిగా సమీక్షించి, నాలుగు రాష్ట్రాలకు కలిపి కొత్తగా కృష్ణా నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ, ఏపీ కోరుతున్నాయి. ట్రిబ్యునల్ మిగులు జలాలను గుర్తించి వాటిని పంపిణీ చేయడాన్ని తప్పుపడుతున్నాయి. ప్రస్తుతం అమలవుతు న్న పద్ధతి ప్రకారం కృష్ణా నుంచి కర్ణాటక, మహారాష్ర్ట 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే అదనంగా మరో 254 టీఎంసీలు అంటే 1,573 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈమేర దిగువకు నీటి ప్రవాహం తగ్గనుంది. అసలే వర్షాలు సరిగా లేని సమయాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ వరకు వేచి చూడాల్సి వస్తోం ది. అప్పటివరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ ముగిసిపోతుంది. ఇదే జరిగితే రెండు రాష్ట్రాల పరిధిలోని రైతాంగానికి తీరని నష్టం చేకూరుతుందనే విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లనున్నాయి. ఇక నదుల్లో నీటి లభ్యతను అంచనా వేయడానికి జాతీయంగా, అంతర్జాతీయంగా 75% డిపెండబిలిటీ (వందేళ్లలో 75 ఏళ్లపాటు వచ్చిన వరదల సగటు)ను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ 65% డిపెండబిలిటీనే పరిగణనలోకి తీసుకుని, కేటాయింపులు జరిపింది. దీంతో నదుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్టు తేలడంతో కర్ణాటక కు 61 టీఎంసీలు, మహారాష్ట్రకు 43 టీఎంసీలను అదనంగా కేటాయించింది. 112 ఏళ్లల్లో వచ్చి న సరాసరి నీటిని పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ కోరితే.. ట్రిబ్యునల్ 47 ఏళ్లలో వచ్చిన వర ద సరాసరి నీటిని పరిగణనలోకి తీసుకుంది. ఇది కూడా తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగడానికి అవకాశం ఇచ్చిందని, దీనిని సవరించాలని రెండు రాష్ట్రాలు కోరనున్నాయి.