‘కృష్ణా’ జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్ మృతి
సాక్షి, మచిలీపట్నం : కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్-57) గురువారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మొవ్వ మండలం కోసూరు గ్రామంలో సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఆయన ఎస్కే షిప్పింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా వ్యాపారవేత్తగా రాణించారు. తన తల్లి కోసూరు సర్పంచ్‌గా పనిచేయడంతో రాజకీయాలపట్ల ఆసక్తి కనబరిచిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో మొవ్వ మండల జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది జెడ్పీ చైర్మన్ పదవిని చేపట్టారు.
2006 నుంచి 2011 వరకు జెడ్పీ చైర్మన్‌గా జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన ఆయన.. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్‌లో ఇమడలేక 2012 సెప్టెంబర్ 13న వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయన బుధవారం విజయవాడలో జరిగిన బీసీల సదస్సులో పాల్గొన్నారు. రాత్రికి మచిలీపట్నంలోని తన కార్యాలయంలో నిద్రపోయారు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నలతగా ఉందని మళ్లీ పడుకున్నారు. సుమారు 10.30 గంటల సమయంలో కేఎన్నార్‌ను నిద్రలేపేందుకు ఆఫీసు సిబ్బంది లోపలికి వెళ్లడంతో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో ఆయన్ని జిల్లా ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన ఉత్తమ గోసంరక్షక అవార్డు అందుకున్నారు. కేఎన్నార్‌కు చెందిన ఒంగోలు ఎద్దు దేశస్థాయి చాంపియన్‌గా నిలిచి ‘ద్రోణాచార్య కోడె’గా అవార్డు పొందింది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, కృష్ణా జెడ్పీ మాజీ చైర్మన్ కే నాగేశ్వరరావు మృతిపట్ల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాను అత్యంత ఆప్తుడిని కోల్పోయానని తెలిపారు. నలుగురికీ మేలుచేసే నాయకుడిగా జిల్లాలో నాగేశ్వరరావుకు మంచి పేరుందని, ఆయన బీసీల్లో మంచి నేత అని పేర్కొన్నారు. కేఎన్నార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్ గురు వారం రాత్రి హైదరాబాద్‌నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మచిలీపట్నం వెళ్లారు.