
ఎక్కడా లక్ష ఎకరాల రాజధాని లేదు: ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్, డెవలపర్‌లకు లబ్ధి చేకూర్చడానికే రాజధాని పేరిట బలవంతపు భూసేకరణ చేయిస్తోందని టీడీపీ ప్రభుత్వంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపణలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లక్ష ఎకరాల్లో రాజధాని లేదని, ఏపీలో మాత్రం దేనికని ప్రశ్నించారు.
ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక ప్రతినిధులు అంబటి రాంబాబు(వైఎస్సార్‌సీపీ), వి.లక్ష్మణరెడ్డి(జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు), కొరివి వినయ్ కుమార్(ఏపీ కాంగ్రెస్ నేత) బుధవారం సీపీఎం కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరిని కలిసి రైతు పరిరక్షణ వేదిక చేపట్టిన ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్ల పాటు సుదీర్ఘ చర్చలు, పోరాటాలు చేసి సాధించుకున్న భూసేకరణ-2013 చట్టాన్ని సవరించి రైతులకు అన్యాయం చేసే ఆర్డినెన్సును బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు.