
కొత్త ఓటర్లు లక్షన్నర!
- రెండు నెలల్లో అనూహ్య పెరుగుదల
- ఉత్తరంలో అత్యధికం, తర్వాత గాజువాక
- మాడుగుల అత్యల్పం
- జిల్లాలో మొత్తం ఓటర్లు 32,23,858 మంది
- కొత్త వారు 1,47,422
- 1,28,881 పేర్ల తొలగింపు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఓటర్ల జాబితా రూపకల్పన తుది దశకు చేరుకుంది. కొన్ని తొలగింపులు మినహా దాదాపుగా సిద్ధమైంది. ఈ నెల 31వ తేదీన తుది జాబితా ఖరారు కానుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక జాబితా ప్రకారం 1,47,422 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2013 నవంబర్ 18వ తేదీ నాటికి జిల్లాలో 30,76,436 మంది ఓటర్లు ఉండగా, తాజాగా పెరిగిన ఓటర్లతో ఆ సంఖ్య 32,23,858కు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో జరగనున్న ఎన్నికల కోసం గత నవంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
అయిదు ఆదివారాలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో కొత్త ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొత్తగా ఓటరు నమోదు(ఫారం-6)కు 3,02,105 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 2,70,097 దరఖాస్తులను అంగీకరించారు. 31,717 దరఖాస్తులను తిరస్కరించగా 291 పెండిం గ్‌లో ఉన్నాయి. తొలగింపులు(ఫారం-7) కోసం 1,28,881 దరఖాస్తులకు గాను 12,2675 అంగీకరించగా, 3568ని తిరస్కరించారు. 2638 దరఖాస్తులు విచారణలో ఉన్నాయి. సవరణలు(ఫారం-8) కోసం 29,783 మంది దరఖాస్తులు చేయగా 20,750ని ఆమోదించగా 8872ను తిరస్కరణకు గురయ్యాయి. 161 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మార్పులు, చేర్పులు(ఫారం-8ఏ) కోసం 9167కు 6733ను అంగీకరించగా 1757 దరఖాస్తులను తిరస్కరించారు. 522 విచారణలో ఉన్నాయి.
ఆన్‌లైన్‌పై మొగ్గు : ఓటరు నమోదుకు ఎక్కువగా ప్రజలు ఆన్‌లైన్‌పైనే ఆసక్తి చూపించారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా అధిక శాతం మంది ఓటరు నమోదు చేసుకున్నారు. కొత్త ఓటు నమోదుకు(ఫారం-6)కు మొత్తం 3,02,105 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 1,37,383 మంది ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపరిచారు. వీటిని బూత్ లెవెల్ అధికారులు పరిశీలించి 1,12,415 దరఖాస్తులను అంగీకరించగా 24,684 దరఖాస్తులను తిరస్కరించారు. తొలగిం పులు(ఫారం-7) కోసం ఆన్‌లైన్‌లో 1163, సవరణలు(ఫారం-8) కోసం 19860, మార్పులు, చేర్పులు(ఫారం-8ఏ) కోసం 2555 దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్ ను ఆశ్రయించిన వారిలో యువత, మహిళలే అధికం.
భారీగా తొలగింపులు
కొత్త ఓటరు జాబితా రూపకల్పనలో భారీగా తొలగింపులు చోటుచేసుకున్నాయి. అధిక మందికి రెండు ప్రాంతాల్లో ఓటరు కార్డులు ఉండడం, ఇక్కడ కార్డులు పొందిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, బోగస్‌కార్డులు ఇలా భారీగా ఓటరు కార్డులను జాబితా నుంచి తొలగించారు.
మహిళలే కీలకం : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా మహిళలే కీలక భూమిక పోషించే అవకాశం కనిపిస్తోంది. 2013 జాబితా ప్రకారం జిల్లాలో 15 లక్షల 33 వేల 783 మంది పురుష ఓటర్లు ఉండగా, 15 లక్షల 42 వేల 591 మహిళా ఓటర్లు ఉన్నారు. అప్పుడే కాకుండా తాజాగా వచ్చిన దరఖాస్తుల్లో కూడా 50 శాతం వరకు మహిళలే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో 2014 ఎన్నికల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
31న తుది జాబితా
తుది ఓటరు జాబితాను ఈ నెల 31న ప్రచురించనున్నారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే దాన్ని ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత 27, 28 తేదీల్లో వాటిని ముద్రించనున్నారు. 31వ తేదీకి సిద్ధం చేసి ప్రకటించనున్నారు.