అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నిరుపేదలకు భూములు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నగరంలోని కృష్ణకళామందిరంలో మంగళవారం ఏడో విడత భూ పంపిణీ అట్టహాసంగా జరిగింది. అనంతపురం రెవెన్యూ డివిజన్‌లోని 3833 ఎకరాల భూ పంపిణీకి 2076 మందిని ఎంపిక చేశారు. లబ్ధిదారుల్లో 593 మంది ఎస్సీలు, 147 మంది గిరిజనులు, 1031 మంది వెనుకబడిన తరగతుల వారు, 11 మంది మైనార్టీలు, 294 మంది ఓసీలు ఉన్నారు.
వీరిలో కొందరికి మంత్రి రఘువీరా చేతుల మీదుగా పట్టా పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్‌లను అందజేశారు. సాగుదారులకే పట్టాలు పంచామని మంత్రి అన్నారు. పేదలకు సామాజిక భద్రతతోపాటు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అసెంబ్లీలో రాష్ర్ట విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఒకేతాటిపైకి రావాలన్నారు. రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ సాగు చేస్తున్న వారికే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపుల విషయంలో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ వెంకటేశం, ఆర్డీఓ హుస్సేన్‌సాబ్ పాల్గొన్నారు.
సాగు భూములకు పట్టాలతో భద్రత
కదిరి అర్బన్ : ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు భూ పంపిణీకింద అందజేసిన పట్టాలతో భద్రత కల్పిస్తున్నామని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. కదిరి బాలికల ఉన్నతపాఠశాలలో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. భూ పంపిణీకి కదిరి నియోజకవర్గంలో 1727 మంది, పుట్టపర్తి నియోజకవర్గంలో 985 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరందరికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. త్వరలోనే రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సంక్రాంతి లోపు ఇన్‌పుట్ సబ్సిడీ పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. జిల్లాలోని 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటిస్తామని చెప్పారు. అంతకు ముందు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
‘భూ పంపిణీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే’
Published Wed, Jan 1 2014 4:33 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM
Advertisement