అన్యాయం చేస్తే ఒప్పుకోం
రాయచోటి టౌన్: రాయచోటి నియోజక వర్గ ప్రజలను కరువు బారి నుంచి శాశ్వతంగా కాపాడేందుకు హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతాన్ని కరువు నుంచి కాపాడటానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయాలని రూ.4500 కోట్లుతో పనులు మొదలు పెట్టించారని చెప్పారు. ఆయన చేపట్టిన పనులు 70శాతం వరకు పూర్తయ్యాయన్నారు.
తర్వాత పనులు సాగుడం లేదని చెప్పారు. అయితే ఇప్పుడే రాజకీయ దురుద్దేశంతో కొంత మంది పాలకులు రాయచోటి ప్రాంతానికి దాని ఫలాలు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో మనకు రావాల్సిన నీటిని పక్కదారి మళ్లించి అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయమై రాయచోటి నియోజక వర్గ ప్రజలకు అవగాహన కలిగించేదుకు హంద్రీ- నీవా ప్రాజెక్టు కాలువ వెంబడి ఉండే ప్రాంతాలలో పాదయాత్ర చేయన్నుట్లు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిలో వెలుగల్లు ప్రాజెక్టుకు 4టిఎంసిలు, శ్రీనివాస రిజర్వాయర్‌కు 1.2 టిఎంసిలు, ఝరికోన ప్రాజెక్టుకు 1/2 టిఎంసి నీరు వస్తుందని చెప్పారు. వైఎస్సార్ అప్పట్లోనే వెలుగల్లుకు 3 టిఎంసిలు ఇవ్వాలని జివో పాస్ చేయించారని చెప్పారు.
వెలుగుల్లు ప్రాజెక్టు నిండితే కుడి ఎడమ కాల్వల ద్వారా 24000 ఎకరాల భూమి సాగు అవుతందని వివరించారు. ప్రతి నాయకుడు ఆశయంతో రాజకీయాలలోకి రావాలని, ఎలాంటి ఆశయాలు లేకుండా రాజకీయాలు చేస్తే ఏమిటి లాభమన్నారు. రాయచోటి ప్రాంతాన్ని సుభిక్షం చేసే వరకు పోరాడతానని చెప్పారు. అందుకోసం ఎవరితోనైనా కలసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి అన్ని జిల్లాల్లో కార్యాలయాలు ఉన్నాయని, మన జిల్లాలో మాత్రం లేదని, వెంటనే ఏర్పాటుకు తన వంతు కషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎంపిటిసి సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, పల్లపు రమేష్, ఎంపిపి గంగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.